Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లోని నలుగురు సీనియర్ హీరోలను ఛాలెంజ్ చేసిన ఎన్టీఆర్...!

By:  Tupaki Desk   |   21 April 2020 12:00 PM IST
టాలీవుడ్ లోని నలుగురు సీనియర్ హీరోలను ఛాలెంజ్ చేసిన ఎన్టీఆర్...!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో 'బీ ది రియల్ మ్యాన్' అనే ఛాలెంజ్ విస్తృతంగా సాగుతుంది. సందీప్ రెడ్డి వంగా మొద‌లు పెట్టిన ఈ ఛాలెంజ్ జూనియర్ ఎన్టీఆర్ వ‌ర‌కు చేరింది. లాక్‌ డౌన్ వేళ సేవ‌కులు ప‌నికి దూరం కావ‌డంతో ఇంట్లో వారికి చేదోడు వాదోడుగా తాము ప‌ని చేస్తున్నామ‌ని చెబుతున్నారు మ‌న సినీ సెల‌బ్రిటీలు. వాస్తవానికి ఇంటి పనులు చేసేవారు అందుబాటులో లేని లాక్ డౌన్ సమయంలో సెల‌బ్రిటీలకు నిజంగా ఇది సవాలు లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉండే సెలబ్రిటీలు ఇంటి పనులలో భాగస్వాములవడం అనేది వారికి సాధ్యమైన పనిగా అనిపించదు. సెలెబ్రెటీలు ఈ సవాలును స్వీకరించి ఇంటి పనులలో మునిగితేలుతూ ఉంటే ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన ఛాలెంజ్ అని చెప్పవచ్చు. దర్శకధీరుడు రాజ‌మౌళి విసిరిన ఛాలెంజ్‌ ని స్వీక‌రించిన ఎన్టీఆర్ తాజాగా వీడియో షేర్ చేశాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ లో భాగస్వామ్యం అవుతూ మరింత ఊపునిచ్చే వీడియోను విడుదల చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఖాళీగా ఇంట్లో ఉన్న భర్తలు.. తమ భార్యలకు సాయం చేయాలని అతనే రియల్ మ్యాన్ అంటూ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘బీ ది రియల్ మ్యాన్’ అనే ఛాలెంజ్‌ కు దర్శకుడు రాజమౌళి ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన రాజమౌళి తన భార్యకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ చీపురు పట్టి ఇల్లు ఊడుస్తూ.. డోర్స్ క్లీన్ చేసిన వీడియోను సోషల్ మీడియాల షేర్ చేశారు. ఈ సందర్భంగా ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌లో ఎన్టీఆర్ - రామ్ చరణ్‌ లతో పాటుగా సుకుమార్ - కీరవాణి - బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఛాలెంజ్ విసిరారు జక్కన్న. కాగా 'ఛాలెంజ్ సీకరిస్తున్నా జక్కన్న' అంటూ రిప్లై ఇచ్చిన ఎన్టీఆర్.. నేడు ఒక వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.

ఇల్లు తుడుస్తూ.. వంట గిన్నెలు క్లీన్ చేస్తూ.. బయట చెత్తను తుడిచి శుభ్రం చేస్తున్న వీడియోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు ఎన్టీఆర్. ఈ వీడియోతో పాటు 'మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం'.. అంటూ సందేశాన్ని ఇస్తూ.. ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ కి తన బాబాయ్ బాలయ్య.. చిరంజీవి.. నాగార్జున బాబాయ్.. వెంకటేష్.. కొరటాల శివలను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. మరి జూనియర్ విసిరిన ఈ ఛాలెంజ్ ని స్వీకరించి సీనియర్ హీరోలు ఇంటిపనుల్లో పాల్గొంటారేమో చూడాలి.