Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మలయాళ 'భీమ్'కి డబ్బింగ్ చెప్పగలడా...?

By:  Tupaki Desk   |   24 April 2020 5:20 PM IST
ఎన్టీఆర్ మలయాళ భీమ్కి డబ్బింగ్ చెప్పగలడా...?
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'రౌద్రం రణం రుధిరం' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ 'రుధిరం' చూపించబోతున్నాడు. ఈ సినిమాలో చరణ్ 'అల్లూరి సీతారామరాజు'గా కనిపిస్తుండగా.. తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని భాషలలో విడుదలైన రామ్ చరణ్ ఇంట్రో వీడియోకి మంచి స్పందన వస్తున్నది. అందులోనూ ఆ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ యాడ్ అవ్వడం ఇంకా ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ వీడియోలో చరణ్ లుక్ ని ఇష్టపడిన వారెంత మంది ఉన్నారో.. తారక్ గొంతుకి ఫిదా అయిన వారు కూడా అంతే మంది ఉన్నారు. 'అల్లూరి సీతారామరాజు'ని ఎన్టీఆర్ గొంతుతో పరిచయం చేయడం ప్రేక్షకులకి బాగా నచ్చింది. కేవలం ఒకటిన్నర నిమిషం వీడియోతోనే రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడంటే అది ఎన్టీఆర్ వాయిస్ లోని గొప్పదనమే అని చెప్పొచ్చు. తెలుగు హిందీ తమిళ కన్నడ నాలుగు భాషల్లో వాయిస్ ఓవర్ వినిపించిన ఎన్టీఆర్.. తన మాతృభాషే అనుకునేంత సహజంగా.. ప్రతీ భాషలోనూ పర్ఫెక్ట్ డిక్షన్ తో చెప్పాడు.

నాలుగు భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్ ఒక్క మలయాళంలో మాత్రం ఇవ్వలేకపోయాడు. దానికి కారణం మలయాళ భాష మీద పట్టు సాధించడం అంత సులభమైన విషయం కాదు. దక్షిణ భారతంలో మిగతా భాషలను పలికినంత ఈజీగా మలయాళ డిక్షన్ పలకడం కుదరదు. అందుకే మలయాళ వాయిస్ ఓవర్ చెప్పడానికి ట్రై చేయలేదు తారక్. కానీ జక్కన్న సూచన మేరకు అన్ని భాషలలోనూ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారట. లాక్ డౌన్ కారణంగా టైం కలిసి వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ మలయాళం నేర్చుకునే పనిలో పడ్డారట. 'ఆర్.ఆర్.ఆర్' మూవీ మలయాళ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పడానికి.. మలయాళ భాష పై పట్టు సాధించడం కోసం తారక్ ఇంటర్నెట్ ని ఆశ్రయించాడని సమాచారం. ఇప్పటికే ఆన్ లైన్ మలయాళ పాఠాలు వినడంతో పాటు.. డైలీ మలయాళ భాష ప్రాక్టీస్ చేస్తూ ఒకటి రెండు మలయాళ స్టార్ హీరోల సినిమాలను ఎన్టీఆర్ చూస్తున్నట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం. ఒక సినిమా కోసం వేరే భాష నేర్చుకోడానికి తాపత్రయ పడుతున్న ఎన్టీఆర్ డెడికేషన్ ని ఇండస్ట్రీలో అందరూ మెచ్చుకుంటున్నారట. మరి ఎన్టీఆర్ ఆ మలయాళ వాసనను కూడా పట్టేసి మలయాళ భీమ్ కి డబ్బింగ్ చెప్తాడేమో చూడాలి. ఇదిలా ఉండగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల కానుంది.