Begin typing your search above and press return to search.

భారతదేశం గర్వించదగిన సినిమా ఇది: ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   20 March 2022 9:00 AM IST
భారతదేశం గర్వించదగిన సినిమా ఇది: ఎన్టీఆర్
X
'ఆర్ ఆర్ ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ఆ సినిమా స్థాయికి తగినట్టుగానే ఘనంగా జరిగింది. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రను పోషించిన ఎన్టీఆర్ మాట్లాడుతూ .. 'ఆర్ ఆర్ ఆర్' కేవలం ఒక చిత్రం కాదు .. ఇది మా ముగ్గురి బంధం. 'ఆర్ ఆర్ ఆర్' అనేది, తన సినిమాల ద్వారా భారతీయ ఐక్యతను చాటిచెప్పాలనుకుంటున్న ఒక గొప్ప దర్శకుడి కల. ఇది ఒక సాధారణమైన సినిమా కాదు .. భారతదేశం గర్వించదగిన సినిమా. ఇద్దరు నటులు కలిసి నటించడం మానేసిన ఈ రోజుల్లో, ఇద్దరి స్టార్లను కలిపి తీసిన చిత్రం ఇది. రాబోయే తరాలకి ఆదర్శంగా నిలవనున్న సినిమా ఇది.

అలాంటి ఒక సినిమాలో నేను భాగమైనందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. రాజమౌళికి థ్యాంక్స్ చెప్పి నేను దూరం చేసుకోను. కానీ ఈ వేదికపై ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తోంది. రామసేతు నిర్మాణంలో ఒక ఉడతలా నాకు అవకాశం ఇచ్చారు. అందుకు థ్యాంక్స్ చెబుతున్నాను జక్కన్నా. ఒక తల్లి ఎలాగైతే తన పిల్లలకి ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో చెబుతుందో .. అలాంటి ఒక తల్లి స్థానంలో కూర్చుని ఈ సినిమాకి ఒక రూపకల్పన చేసిన రమా రాజమౌళి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

అద్భుతమైన సంగీతంతో భారతదేశం 'ఆర్ ఆర్ ఆర్' వైపు తిరిగి చూసేలా చేసిన మా కీరవాణి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా కూడా ఈ సినిమాను ఒక పెద్ద సంకల్ప బలంతో ఒక మైలురాయిగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో చాలా చాలా ముఖ్యమైన వ్యక్తులు నా అభిమానులు. మీతో పాటు నా బ్రదర్ చరణ్ అభిమానులు కూడా నాకు దక్కారు. ఎల్లప్పుడూ మీరంతా ఇలాగే ఆనందంగా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను.

మీరంతా ఎంత సఖ్యతతో ఉంటే అంత గొప్ప సినిమాలు వస్తాయి. మీరంతా ఇంత దూరం వచ్చి .. ఇంతసేపు నుంచుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందుకు మీ అందరికీ కూడా నా తరఫున .. చరణ్ తరఫున పాదాభివందనాలు చేస్తున్నాను. ఈ ప్రసంగాన్ని ముగించే ముందు చరణ్ గురించి ఒకమాట చెప్పాలి. ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని. చరణ్ తో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మా ఫ్రెండ్షిప్ కి దిష్టి తగలకుండా అలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉండాలి" అంటూ ముగించాడు.