Begin typing your search above and press return to search.

ఓటీటీలపై నోరుపారేసుకున్న స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   24 Jun 2022 10:31 AM GMT
ఓటీటీలపై నోరుపారేసుకున్న స్టార్ హీరో..!
X
డిజిటల్ వేదికలు విస్తృతంగా అభివృద్ధి చెందిన తర్వాత స్టార్ యాక్టర్స్ సైతం వెబ్ కంటెంట్ లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. బిగ్ స్క్రీన్ మీద రిస్ట్రిక్షన్స్ ఉండటంతో నటీనటులకు అన్ని రకాల పాత్రల్లో నటించాడని అవకాశం ఉండదు. కానీ ఓటీటీల వల్ల ఎలాంటి పాత్రలు చేయడానికైనా వీలు కలుగుతుంది. అందుకే ఇటీవల కాలంలో చాలామంది స్టార్స్ డిజిటల్ బాట పట్టారు.

బాలీవుడ్ స్టార్స్ ఎప్పటి నుంచో వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. పాండమిక్ టైమ్ లో ఈ ట్రెండ్ టాలీవుడ్ లో మొదలైంది. తెలుగు నటీనటులు వెబ్ సిరీస్ లు - ఒరిజినల్ మూవీస్ లో నటిస్తున్నారు. ఓవైపు బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటుతూనే.. మరోవైపు ఓటీటీలలో అలరిస్తున్నారు. అయితే విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్న ఓటీటీల గురించి బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం వివాదాస్పద రీతిలో అగౌరవంగా మాట్లాడారు.

ఇటీవల ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పై తన ఆలోచనలను పంచుకున్నాడు. తాను బిగ్ స్క్రీన్ హీరోనని.. అందుకోసమే సినిమాలు చేస్తానని అన్నారు. నటుడిగా కాకుండా నిర్మాతగా ఓటీటీ కోసం చిత్రాలను బ్యాంక్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

“నేను పెద్ద స్క్రీన్ హీరోని. నేను అక్కడ కనిపించాలనే అనుకుంటున్నాను. రూ. 299 లేదా రూ. 499కి అందుబాటులో ఉండడం నాకు ఇష్టం లేదు. దానితో నాకు సమస్య ఉంది. ఎవరైనా నా సినిమాని ట్యాబ్లెట్ లో చూస్తూ, మధ్యలో ఆపివేసి వాష్ రూమ్ కి వెళ్లాల్సిన అవసరం రావడం అనేది నాకు అభ్యంతరకరంగా ఉంటుంది” అని జాన్ అబ్రహం అన్నారు.

అయితే జాన్ తాజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఓటీటీలను కించపరిచినందుకు చాలా మంది అతనిని విమర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో బిగ్ స్క్రీన్ మీద అతని సినిమాలు ఎన్ని విజయాలు సాధించాయని హెద్దేవా చేస్తున్నారు. జాన్ నటించిన 'సత్యమేవ జయతే 2' మరియు 'ఎటాక్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలు చవిచూసిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి లాక్డౌన్ సమయంలో ఓటీటీ వేదికలే ఫిలిం మేకర్స్ ను ఆదుకున్నాయి. రెండు సంవత్సరాలుగా థియేటర్లు మూత పడటంతో అందరికీ ఓటీటీలే దిక్కయ్యాయి. ఆ సమయంలో అనేక సినిమాలు డిజిటల్ వేదికలపైనే విడుదలయ్యాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన నిర్మాతలను బయటపడేసాయి. కానీ జాన్ మాత్రం ఓటీటీలను తక్కువ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆ మధ్య జాన్ అబ్రహాం ప్రాంతీయ సినిమాలపై చిన్నచూపుగా మాట్లాడి ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తానొక హిందీ సినిమా హీరోనని.. ఇతర నటీనటుల మాదిరిగా తెలుగు లేదా మరో ప్రాంతీయ భాషా చిత్రంలో తానెప్పటికీ నటించనని అన్నారు. యాక్టర్ ని కాబట్టి ఏదొక సినిమాలో కనిపించాలనే ఉద్దేశంతో నటించనని జాన్ వ్యాఖ్యానించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.