Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : 'జోహార్'

By:  Tupaki Desk   |   14 Aug 2020 9:30 AM GMT
మూవీ రివ్యూ : జోహార్
X
చిత్రం : 'జోహార్'

నటీనటులు : నైనా గంగూలీ - ఎస్తేర్ అనిల్ - చైతన్య కృష్ణ - అంకిత్ కొయ్యా - శుభలేఖ సుధాకర్ - ఈశ్వరి రావు - రోహిణి తదితరులు
సంగీతం : ప్రియదర్శన్‍
ఛాయాగ్రహణం : జగదీష్‍ చీకటి
నిర్మాతలు : భాను సందీప్‍ మార్ని
స్క్రీన్ ప్లే - డైరెక్షన్ : తేజ మార్ని

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' ఇతర ఓటీటీలతో పోటీ పడే ప్రయత్నంలో కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ''జోహార్'' అనే పొలిటికల్ థ్రిల్లర్ మూవీని 'ఆహా' ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. తండ్రి జ్ఞాపకార్థం విగ్రహం పెట్టాలనే ఓ యువనేత నిర్ణయం.. ప్రేమ, లక్ష్యం, అవసరం, ఆరోగ్యం కోసం పోరాడే నలుగురు జీవితాల్ని ఏవిధంగా ఇబ్బందులకు గురి చేసిందనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ మరియు ట్రైలర్లతో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న 'జోహార్' సినిమా ఎలా ఉందో చూద్దాం.

ఒకరితో ఒకరికి సంబంధం లేని ఐదు జీవితాలపై ఒక కీలకమైన నిర్ణయం ఎలాంటి ప్రభావాలను చూపించిందనే కోణంలో ఈ సినిమా రూపొందింది. తండ్రి అకాలమరణంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యువనాయకుడు తన తండ్రి జ్ఞాపకార్థం ఓ భారీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకుంటాడు. సినిమా మొత్తం ఈ విగ్రహ ఆవిష్కరణ చుట్టూ జరుగుతుంది. అలానే ఉద్ధానం కాలేయ సమస్య వల్ల భర్తను పోగొట్టుకున్న ఓ మహిళా రైతు (ఈశ్వరి రావు).. వేశ్య గృహంలో నివసించే అమ్మాయి (ఎస్తేర్ అనిల్).. టీ కొట్టులో పనిచేసే కుర్రాడు (అంకిత్‍).. అథ్లెట్‍ అవ్వాలనే కోరికతో జీవనం సాగించే యువతి (నైనా గంగూలి).. అనాథశ్రయాన్ని నడిపే ఓ స్వాతంత్య్ర సమరయోధుడు జీవితాలను ముడిపెడుతూ ఈ స్టోరీని అల్లుకున్నారు. తమ వ్యక్తిగత ఎజెండా కోసం ప్రజా సమస్యలను పట్టించుకోని రాజకీయ నాయకులపై తీసిన సినిమా అని చెప్పవచ్చు.

భావోద్యేగాలతో కూడిన పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి దర్శకుడు ఎంచుకున్న ఉద్దేశ్యం గొప్పదనే చెప్పాలి. అయితే స్టోరీ మొత్తం కేవలం ఓ విగ్రహ ఏర్పాటు చేయడం చుట్టూనే కాకుండా ఇంకొంచం లోతుగా ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారు అనే దానిపై ద్రుష్టి పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బలమైన ఎమోషన్స్ క్యారీ చేయడంలో కాస్త తడబడ్డారనిపిస్తుంది. అందులోనూ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ ఊహించగలిగే విధంగా ఉన్నాయి. అయితే ఒకరి స్టోరీకి మరొకరి స్టోరీకి లింక్ చేసే విధానం మెప్పించినప్పటికీ ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయారు. కథలో మరికొన్ని ట్విస్టులు జత చేసి కథనం ఫాస్టుగా ముందుకు తీసుకెళ్తే బాగుండేది అనే ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ మరియు ఈశ్వరి రావ్ లు తమ పాత్రలకు న్యాయం చేసారు. యువ రాజకీయ నాయకుడిగా నటించిన కృష్ణ చైతన్య ఆకట్టుకున్నాడు. అలాగే గ్లామరస్ గర్ల్ నైనా గంగూలీ - ఎస్తేర్ అనిల్ లు మంచి నటన కనబరిచారు. దర్శకుడు తేజ మార్ని ప్రతి ఒక్కరి నుండి అద్భుతమైన నటనకు రాబట్టుకున్నాడని చెప్పవచ్చు. ఇలాంటి బలమైన ఉద్దేశ్యాన్ని చెప్పే క్రమంలో ఆయన చూపించిన ఎమోషన్స్ చాలా చోట్ల బాగున్నాయి. రాజకీయంగా డైరెక్టర్ స్టోరీలో చెప్పిన కొన్ని అంశాలు బాగున్నాయి. 'అంతరిక్షం నుండి చూస్తే విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయా సార్.. పేదరికం కనిపించదా' వంటి డైలాగులు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సాంగ్స్ సినిమాలో ఇబ్బందిగా అనిపించినా నేపథ్య సంగీతం మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితనం మరియు ఎడిటింగ్ వర్క్ ని మెచ్చుకుని తీరాలి. మొత్తం మీద ఈ సినిమా స్లోగా సాగినప్పటికీ.. భావోద్యేగాలతో కూడిన ఈ సిన్సియర్ అటెంప్ట్ ని ఒకసారి చూడొచ్చు.