Begin typing your search above and press return to search.

బాహుబలి ఖాతాలో వెరైటీ రికార్డు

By:  Tupaki Desk   |   29 Nov 2017 4:26 AM GMT
బాహుబలి ఖాతాలో వెరైటీ రికార్డు
X

ఈ ఏడాది భారతీయ వెండితెరపై భారీ సంచలనం అంటే బాహుబలే. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలై అంచనాలకు అందని విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి భాషలోనూ రికార్డులను తుడిచిపెడుతూ కొత్త రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటులకన్నా వాళ్ల పాత్రలకే ఎక్కువ గుర్తింపు వచ్చిందంటే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ రేంజిలో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. అందుకే ఈ చిత్రం ఓ అవార్డుల నామినేషన్లలోనూ ఓ కొత్త రికార్డు సృష్టించింది.

నేషనల్ మీడియా అయిన సీఎన్ ఎన్ న్యూస్ ఛానల్ ఏటా ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అని అవార్డులను అందిస్తుంటుంది. అందులో ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో ఏడాది మొత్తంమీద ఎక్కువగా వార్తల్లో నిలిచిన నటులకు ఈ పురస్కారం లభిస్తుంది. ఇందులో ఈ ఏడాది నామినీలుగా ఛానల్ ఎంపిక చేసిన వారిలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్... న్యూటన్ సినిమా హీరో రాజ్ కుమార్ రావ్ లతోపాటు ఆ చిత్ర దర్శకుడు అమిత్ మసూర్కర్ ఆ చిత్రనటుల్లో ఒకరైన మయాంక్ తెవారి సంయుక్తంగా ఎంపికయ్యారు. నాలుగో నామినీగా టీం బాహుబలి మొత్తం ఎంపికైంది. సాధారణంగా ఇలాంటి అవార్డులకు అవార్డుకు ఎవరో ఒకరు లేదా ఇద్దరిని నామినేట్ చేస్తారు. కాని ఇక్కడ ఏకంగా టీమ్ మొత్తం నామినేట్ అయిపోయింది.

బాహుబలి - దేవసేన - భళ్లాలదేవ - శివగామి.. ఆయా పాత్రల్లో నటించిన వారంతా అంతకుమించి ఆ రోల్ కు న్యాయం చేయలేరనేంత బ్రహ్మాండంగా నటించారు. అలాంటప్పుడు ఒకరిద్దరికో ఎందుకని మొత్తం ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు అందరినీ ఎంపిక చేసేశారు. ఇలా ఓ సినిమా టీం మొత్తం ఒక అవార్డుకు ఎంపికవడమూ రికార్డే. మరి టీమ్ బాహుబలి ఇండియన్ ఆఫ్‌ ద ఇయర్ అనిపించుకుంటుందా? చూద్దాం.