Begin typing your search above and press return to search.

వెండితెర‌పై.. స‌ముద్ర‌పు ‘జెట్టి’!

By:  Tupaki Desk   |   18 May 2021 6:00 PM IST
వెండితెర‌పై.. స‌ముద్ర‌పు ‘జెట్టి’!
X
స‌ముద్రం అంతులేనిది.. సినిమాల విష‌యంలోనూ అంతే.. స‌ముద్రం ఎన్న‌టికీ త‌ర‌గ‌ని క‌థా వ‌స్తువు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్నో సినిమాలు స‌ముద్రం బ్యాక్ డ్రాప్ తో తెర‌కెక్కాయి. అయితే.. హార్బ‌ర్ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ సౌత్ లో పూర్తిస్థాయి సినిమా రాలేద‌ని, ఆ మొద‌టి సినిమా త‌మ‌దేనంటున్నారు వేణుమాధ‌వ్‌, సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక‌.

వ‌ర్ధిని ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై వేణుమాధ‌వ్ నిర్మించిన మూవీ 'జెట్టి'. సుబ్రహ్మణ్యం తెరకెక్కించారు. ఇటీవ‌ల చిత్ర లోగోను రిలీజ్ చేసిన యూనిట్‌.. సినిమాకు సంబంధించిన విశేషాల‌ను వెల్ల‌డించింది. మ‌త్స్య‌కారుల జీవ‌న విధానాల‌ను, వారి క‌ట్టుబాట్ల‌ను వివ‌రిస్తూ.. వారి క‌ష్టాల్ఎ ప‌రిష్కారం చూప‌డ‌మే త‌మ 'జెట్టి' ఉద్దేశ‌మ‌ని చెప్పారు నిర్మాత వేణుమాధ‌వ్‌.

అనాదిగా వ‌స్తున్న ఆచారాల‌ను న‌మ్ముకొని జీవనం సాగిస్తున్న మ‌త్స్య‌కారుల క‌థ‌ను ద‌ర్శ‌కుడు అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అన్నారు. స‌ముద్రం మీద అల‌ల‌తో పోటీప‌డుతూ పొట్ట‌పోసుకునే గంగ‌పుత్రుల జీవితాన్ని అంతే స‌హ‌జంగా తెర‌కెక్కించిన‌ట్టు చెప్పారు.

కొన్ని వంద‌ల గ్రామాలు, వేల కుటుంబాలు క‌లిసి కొన్ని త‌రాలుగా చేస్తున్న పోరాట‌మే 'జెట్టి' అని అన్నారు. ఒక గోడ వారి స్వ‌ప్నం అన్న నిర్మాత‌.. దాని పేరు 'జెట్టి' అని చెప్పారు. దీన్ని సాధించుకోవ‌డానికి వారు ప‌డిన అవ‌స్థ‌లు, వారి జీవితంలో ఇది ఎంత ముఖ్యం అనేది సినిమాలో చూపించిన‌ట్టు చెప్పారు.

కృష్ణ అనే కొత్త న‌టుడు హీరోగా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. నందితా శ్వేత ప్ర‌ధాన పాత్రలో న‌టించారు. ఈ సినిమాను మొత్తం నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.