Begin typing your search above and press return to search.

కన్నడ బాహుబలితో తలపడనున్న జెర్సీ..!

By:  Tupaki Desk   |   16 Feb 2022 7:31 AM GMT
కన్నడ బాహుబలితో తలపడనున్న జెర్సీ..!
X
కరోనా పాండెమిక్ నేపథ్యంలో సినిమాల విడుదలలో గందరగోళం ఏర్పడింది. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నప్పటికీ ఎప్పుడు ఏ సినిమా థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకే మేకర్స్ డేట్ లాక్ చేయడం.. మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చన బాలీవుడ్ 'జెర్సీ' సినిమా విడుదల తేదీని మంగళవారం ప్రకటించారు.

బాలీవుడ్ స్టార్స్ షాహిద్‌ కపూర్‌ - మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''జెర్సీ''. ఇది తెలుగులో నాని హీరోగా గౌతమ్‌ రూపొందించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ కి అధికారిక హిందీ రీమేక్. అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. సమ్మర్ కానుకగా 2022 ఏప్రిల్ 14న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన అమీర్ ఖాన్ - నాగచైతన్య 'లాల్ సింగ్ చద్దా' సినిమా వాయిదా పడటంతో.. అదే తేదీకి 'జెర్సీ' చిత్రాన్ని తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాకపోతే ఆరోజే కన్నడ బాహుబలిగా పిలవబడే 'కేజీయఫ్: చాప్టర్ 2' విడుదల కానుంది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీఎఫ్' మూవీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. దీంతో ఇప్పుడు దానికి కొనసాగింపుగా రాబోతున్న పార్ట్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'కేజీయఫ్ 2' సినిమా ఉండటంతో చాలా వరకు ఫిలిం మేకర్స్ అందరూ ఏప్రిల్ 14ను వదిలేసి ఇతర తేదీలను బ్లాక్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు హిందీ 'జెర్సీ' చిత్రాన్ని బరిలో దింపుతున్నారు. కేజీయఫ్ అనేది పాన్ ఇండియా మూవీ కావడంతో మిగతా భాషలను పక్కన పెడితే బాలీవుడ్ మార్కెట్ లో గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు విజయ్ - పూజాహెగ్డే కలిసి నటించిన 'బీస్ట్' సినిమాని అదే రోజున హిందీలో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.

'మాస్టర్' చిత్రం నార్త్ లో కూడా మంచి వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో 'బీస్ట్' ని కూడా పోటీగా భావించాల్సి ఉంటుంది. కాకపోతే 'జెర్సీ' మిగతా రెండు సినిమాలకు భిన్నమైన జోనర్ కావడం.. ఆల్రెడీ హిట్టైన చిత్రానికి రీమేక్ అవడం అనేవి కలిసొచ్చే అంశాలు. అందులోనూ టాలీవుడ్ నిర్మాతలు నిర్మించిన మూవీ కావడంతో తెలుగులోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

క్రికెటర్‌ గా చూడాలనుకున్న తన కొడుకు కోరికను తీర్చేందుకు ఓ తండ్రి ఏం చేశాడు? 36 ఏళ్ల వయసులో తిరిగి క్రికెట్‌ బ్యాట్‌ పడితే అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే భావోద్వేగ కథాంశంతో 'జెర్సీ' సినిమా రూపొందింది. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరించారు.

సచేత్-పరంపర ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.