Begin typing your search above and press return to search.

పవన్ సినిమాకు తీరని కాపీ కష్టాలు

By:  Tupaki Desk   |   11 Feb 2018 9:34 AM GMT
పవన్ సినిమాకు తీరని కాపీ కష్టాలు
X
అజ్ఞాతవాసి సినిమాని ఫ్యాన్స్ తో సహా ప్రేక్షకులందరూ మర్చిపోయినప్పటికి దీని ఒరిజినల్ గా ముందు నుంచి ప్రచారంలో ఉన్న ఫ్రెంచ్ సినిమా ది లార్గో వించ్ దర్శకుడు జెరోం సల్లె మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ఏదో ఒకటి తేలే దాకా పోరాడతాను అని స్పష్టం చేస్తున్నాడు. ప్రముఖ మీడియా సంస్థ హైదరాబాద్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానేం చేయాలనుకుంటున్నది స్పష్టం చేసాడు. లాయర్ ద్వారా నోటీసు ఇచ్చి రెండు వారాలు దాటినా ఇప్పటి దాకా హారికా అండ్ హాసిని నుంచి ఎటువంటి స్పందన లేదన్న జెరోం ఇలా మౌనంగా ఉండిపోయి స్మార్ట్ అనిపించుకోవాలనే ప్లాన్ ఏదైనా ఉంటే అది భగ్నం కాక తప్పదు అంటున్నాడు. అజ్ఞాతవాసి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైందని ఇకపై కాపీలు కొట్టి సినిమాలు తీసేవాళ్ళు అమెరికా - ఫ్రాస్స్ లాంటి దేశాల్లో విడుదల చేయాలంటే బాగా అలోచించుకునేలా చర్యలు చేపట్టబోతున్నట్టు వార్నింగ్ లాంటిది ఇచ్చేసాడు.

జెరోం సల్లె చెప్పిన ప్రకారం అజ్ఞాతవాసి ది లార్గో వించ్ ఆధారంగా రూపొందుతోంది అనే వార్త విన్నప్పుడు తాము హక్కులు అమ్మిన టి సిరీస్ సంస్థే ఇది నిర్మిస్తోందని భావించారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని సంప్రదించే లోపే టి సిరీస్ కు హారికా సంస్థకు మధ్య ఏదో లోపాయకారి ఒప్పందం జరిగిన వార్త విని వాళ్ళను కూడా ఆడిగితే ఇంకా స్పందించలేదు. పారిస్ లో ఈ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు రద్దీని చూసి ఆశ్చర్య పోయిన జెరోం క్లైమాక్స్ - సెట్స్ తో సహా చాలా మటుకు తన సినిమానే పోలి ఉండటం చూసి షాక్ తిన్నారు. ముఖ్యంగా టెర్రస్ మీద జరిగే చివరి ఫైట్ ను కూడా యధాతధంగా తీయటం తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

హారికా అండ్ హాసిని సంస్థ తన వద్దకు వచ్చేలా చేసుకుంటానని చెప్పిన జెరోం ఇది మాత్రం తేలిగ్గా వదలను అంటున్నాడు. ఇండియన్ సినిమా అంటే ఎంతో ఇష్టమన్న జెరోం సాల్లెకు రాజమౌళి అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పాడు. చూస్తుంటే జెరోం సల్లె చట్టప్రకారంగానే హారికా సంస్థను ఇబ్బందుల్లో నెట్టెలా ఉన్నాడు. వారుగా వస్తే పరిష్కారం చూడొచ్చు అని క్లూ ఇస్తున్న జెరోం దగ్గరకు రాజీ కోసం చినబాబు వెళ్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా పడింది. అసలే కోలుకోలేని నష్టాలు ఇచ్చిన అజ్ఞాతవాసి సెటిల్ మెంట్లు ఇంకా ఒక కొలిక్కి రాక ముందే జెరోం సల్లె మాటలు గాయాన్ని ఇంకాస్త పెద్దది చేసేలా ఉన్నాయి.