Begin typing your search above and press return to search.

గెలిచినా ఓడినా 'మా' క్యాంటీన్ పెడతా: జీవిత

By:  Tupaki Desk   |   9 Oct 2021 2:31 PM GMT
గెలిచినా ఓడినా మా క్యాంటీన్ పెడతా: జీవిత
X
'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం క్లైమాక్స్ కు చేరింది. పోటీలో నిలిచిన మంచు విష్ణు - ప్రకాష్ రాజ్ ‏లు ప్యానెల్స్ ముమ్మర ప్రచారాలు చేస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా ఈసారి 'మా' ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇరు వర్గాలు ఆరోపణలు విమర్శలు, హెచ్చరికలు, వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. ఈ క్రమంలో లోకల్ - నాన్ లోకల్ అంటూ ప్రాంతీయవాదాన్ని కూడా తెర మీదకు తీసుకొచ్చారు.

రేపు జరగనున్న పోలింగ్ కు తక్కువ సమయమే ఉండటంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు 'మా' ఎన్నికలపై ఓ లేఖతో పాటుగా ఓ ఆడియో మెసేజ్ వినిపించారు. ఎన్నికల్లో తన తనయుడు మంచు విష్ణు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరోవైపు 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రెటరీగా పోటీ చేస్తున్న జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. లాస్ట్ మినిట్ వరకు ‘మా’ లో డైలాగ్ వార్ సహజమేనని.. రేపు పోలింగ్ వరకు ప్రచారం చేసుకోనున్నట్టు తెలిపారు. 'మా' ఎన్నికల కోసం పూర్తిగా సన్నద్ధమయ్యామని ఆమె అన్నారు.

మ్యానిఫెస్టో ప్రకటించపోవడం తప్పేమీకాదని.. తమ ఎజెండాను సభ్యులకు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నామని జీవిత తెలిపారు. కామెడీ అవుతుందని మ్యానిఫెస్టోని విడుదల చేయలేదని చెప్పారు. మంచు మ్యానిఫెస్టో బాగానే ఉందని.. కాకపోతే 'మా' కోసం ఫండ్ రైజ్ ఎలా అన్న దాని మీద స్పష్టత లేదని.. మ్యానిఫెస్టోలో పేర్కొన్నవి చేయకపోతే ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా ‘మా’ క్యాంటిన్ ను పెడతామని జీవిత ప్రకటించారు.

రాజశేఖర్ ట్రస్ట్ ద్వారా సహకారం తీసుకుని 24 క్రాఫ్ట్స్ కోసం 'మా' క్యాంటిన్ ను ఏర్పాటు చేస్తామని.. అమ్మా క్యాంటిన్ - అన్న క్యాంటిన్ మాదిరిగా 'మా' క్యాంటిన్ ఉంటుందని జీవిత రాజశేఖర్ తెలిపారు. మోహన్ బాబుని రాజశేఖర్ కలవడాన్ని కూడా భూతద్దంలో చూపిస్తూ వక్రీకరించి మాట్లాడుతున్నారని.. నరేష్ ఈ విషయాన్ని మరీ పెద్ద సీన్ చేస్తున్నారని ఆమె అన్నారు. ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయాన్ని మోహన్ బాబు వద్ద రాజశేఖర్ వ్యక్తం చేసారని తెలిపారు.

అలానే మోహన్ బాబు వెనక నరేష్ గోతులు తవ్వుతున్నారని.. అది మంచు ఫ్యామిలీకే నష్టమని జీవిత అభిప్రాయపడ్డారు. గెలుపుపై జ్యోతిష్యం చెప్పను కానీ ఈసారి ఎనభై శాతం 'మా' సభ్యులు ఆలోచించి ఓటు వేస్తారని అన్నారు. ఇంతకముందు ఓ ఇంటర్వ్యూలో ‘మా’ విషయంలో నరేశ్ స్వార్థంతో పనిచేశారు.. ప్రకాశ్ రాజ్ నిజాయతీగా పనిచేస్తారని ఆమె చెప్పారు. మోహన్ బాబు కుటుంబాన్ని చూస్తుంటే జాలేస్తోందని.. నరేశ్ తవ్విన గుంతలో ఆ ఫ్యామిలీ పడిపోతుందని జీవిత చెప్పుకొచ్చారు.