Begin typing your search above and press return to search.

ఇష్యూని పెద్దది చేసింది చిరు అభిమానులేనట!

By:  Tupaki Desk   |   23 Dec 2016 11:30 AM GMT
ఇష్యూని పెద్దది చేసింది చిరు అభిమానులేనట!
X
అసలు మెగాస్టార్ చిరంజీవికి - జీవిత రాజశేఖర్ దంపతులకి మధ్య ఉన్న గొడవ ఏమిటి? దానికి కారణం ఎవరు? మరీ దాడులు చేసుకోవాల్సినంత పెద్ద గొడవలు వీరిద్దరి మధ్యా ఉన్నాయా? అలా కాని పక్షంలో వీరిమధ్య నాడు ఆ స్థాయిలో ఇబ్బందులు రావడానికి కారణం ఎవరు? ఈ విషయాలన్నింటికీ ఒక్క ముక్కలో సమాధానం చెబుతున్నారు జీవిత! అవును... 2009 ఎన్నికల్లో చిరంజీవితో ఢీ అంటే ఢీ అని జీవిత రాజశేఖర్ దంపతులు పోరాడటానికి, విషయం సీరియస్ అవ్వడానికి కారణం చిరంజీవి అభిమానులు అని చెబుతున్నారు జీవిత!!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాటి విషయాల్లో స్పందించిన జీవిత.... చిరంజీవికి మీరు సపోర్ట్ చేస్తారా అని? మీడియా ఒక ప్రశ్న సంధిస్తే... దానికి సమాధానం చెప్పారు రాజశేఖర్. ఏమని అంటే... "తోటి నటుడిగా చిరంజీవిని అభిమానిస్తాను కానీ.. ఆయనకు పొలిటికల్ అనుభవం లేదు. కాబట్టి నేను వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను" అని!! ఆ విషయాన్ని చిరంజీవి గారు, తాము సీరియస్ గా తీసుకున్నామా లేదా అనే విషయం కాసేపు పక్కనపెడితే ఆయన ఫ్యాన్స్ మాత్రం ఈ చిన్న విషయాన్ని పెద్దదిగా చేశారని చెబుతున్నారు జీవిత. ఈ విషయాన్ని చిరు అభిమానులు పెద్దగా చేయడం వల్లే తాము కూడా సీరియస్ గా తీసుకుని చిరంజీవికి వ్యతిరేకంగా పనిచేశామని చెప్పారు. అనంతరం రాజకీయాలు, వాటిలో తమకొచ్చిన అనుభవాలపై కూడా జీవిత స్పందించారు.

తాము కాంగ్రెస్ పార్టీలో ఉండి చిరంజీవికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడితే... తీరా ఎన్నికలు అయిపోయాక చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌ లో కలిసిపోయింది. ఆ సమయంలోనే తమకు రాజకీయాలంటే ఏమిటో పూర్తిగా తెలిసిందని, అనంతరమే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామని అన్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జీవిత ఈ సందర్భంగా పెద్దనోట్ల రద్దు విషయంపై కూడా స్పందించారు. పెద్దనోట్లు రద్దు నిర్ణయాన్ని అందరూ తప్పుబడుతున్నారు కానీ.. మోడీ సాహసోపేతంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశానికి చాలా మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఈ నిర్ణయంవల్ల ఎదురైన సమస్యలు కూడా చాలా చిన్నవని, అయితే ఏముంది దేశానికి మాత్రం మంచి జరుగుతుంది కదా అని అన్నారు. ఇక బ్యాంకుల ముందు క్యూలో నిల్చున్న సామాన్యులపై కూడా జీవిత డిఫరెంట్ గా స్పందించారు. మోడీ నిర్ణయం వల్ల నిజమైన పేదవాళ్లు అంతా బాగానే ఉన్నారని, బ్యాంక్‌ ల ఎదుట క్యూలో నిల్చున్నవారిలో నల్లదొంగల నుంచి కమీషన్‌ తీసుకుని వచ్చినవారే చాలామంది ఉన్నారని జీవిత అన్నారు!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/