Begin typing your search above and press return to search.

జేడీని హీరోగా చూస్తారా?

By:  Tupaki Desk   |   16 March 2018 11:27 AM IST
జేడీని హీరోగా చూస్తారా?
X
90ల్లో హీరోగా ఒక వెలుగు వెలిగాడు జేడీ చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ లాంటి విలక్షణ దర్శకులు అతడిని బాగా ప్రోత్సహించారు. కానీ హీరోగా ఎంతో కాలం హవా సాగించలేకపోయాడతను. త్వరగా లైమ్ లైట్లోంచి వెళ్లిపోయాడు. అవకాశాలు తగ్గిపోయాయి. హీరోగా ఒక దశలో చెత్త చెత్త సినిమాలన్నీ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లిపోయి గురువు వర్మ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేశాడు. ఆపై దర్శకుడిగా కూడా మారి కొన్ని సినిమాలు తీశాడు. తెలుగులోనూ ‘హోమం’.. ‘సిద్ధం’ లాంటి చిత్రాలు రూపొందించిన జేడీ.. మధ్యలో మళ్లీ నటుడిగా పునరాగమనం చేశాడు. స్పెషల్ క్యారెక్టర్లు చేస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశాడు.

ఐతే విలన్ - క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకే పరిమితం అవుతాడనుకుంటే అతనేమో మళ్లీ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇందుకు అతను ఎంచుకున్న దర్శకుడెవరో తెలిస్తే షాకవ్వాల్సిందే. దర్శకుడిగా తొలి ప్రయత్నంలో ‘రణం’ లాంటి హిట్ మూవీ తీసినప్పటికీ.. ఆ తర్వాత చెత్త చెత్త సినిమాలు రూపొందించిన అమ్మ రాజశేఖర్ డైరెక్షన్లో జేడీ నటిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘ఉగ్రం’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా నుంచి జేడీ లుక్స్ కొన్ని బయటికి వచ్చాయి. జేడీ ఔడ్ డేట్ అయిపోయాడన్న సంగతి ఆ లుక్స్‌లో స్పష్టంగా తెలిసిపోతోంది. హీరోగా మార్కెట్ కోల్పోయాక కూడా లీడ్ రోల్స్ చేసి చేసి అలసిపోయిన రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు లాంటి వాళ్లు రూటు మార్చి బాగానే స్థిరపడ్డారు. కానీ శ్రీకాంత్ మాత్రం ఇంకా హీరో వేషాలపై మోజు వదిలించుకోలేక చాలా ఇబ్బందికర పరిస్థితికి చేరాడు. ఇదంతా చూస్తూ జేడీకి మళ్లీ హీరో వేషాలపై మోజేంటో అని జనాలు కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ తరం ప్రేక్షకులు జేడీని హీరోగా చూడటానికి ఏమాత్రం ఇష్టపడతారన్నది సందేహం.