Begin typing your search above and press return to search.

కొడుకుని పోలీసులకు పట్టించిన జయసుధ

By:  Tupaki Desk   |   14 Dec 2015 7:00 PM IST


అవును జయసుధ తన కొడుకును పోలీసులకు పట్టించింది. కారణమేంటంటే.. అమ్మాయిల్ని ఏడిపించడమే. కొడుకని కూడా చూడకుండా తప్పు చేసినందుకు ‘షి’ టీంను పిలిచి మరీ అతణ్ని వారికి అప్పగించేసింది జయసుధ. వినడానికి ఇది చాలా చిత్రంగా అనిపిస్తోంది కదూ. ఐతే ఇదంతా రీల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో జరిగిన కథన్నమాట. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే అయిన జయసుధ.. అమ్మాయిలపై అఘాయిత్యాలకు, ఈవ్ టీజింగ్ కు వ్యతిరేకంగా ‘షి’ టీం చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో పాలు పంచుకుంటోంది. ఈ సందర్భంగా షి టీమ్ ఓ వీడియో రూపొందిచింది.

అందులో జయసుధ పాత్ర అమ్మాయిల్ని ఏడిపించాడన్న కారణంతో తన కొడుకని కూడా చూడకుండా అతణ్ని ‘షి’ టీంకు అప్పగిస్తుంది. అతడి చెంప కూడా చెల్లుమనిపిస్తుంది. తెలంగాణ పోలీసు విభాగం ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియో కోసం జయసుధ ఉచితంగా నటించడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘‘అయిపోయాక తిట్టడం కాదు.. అవుతున్నపుడే ఆపడం నేర్చుకోండి’’ అంటూ జయసుధ చివర్లో చెప్పే డైలాగుతో జనాలు బాగా కనెక్టవుతున్నారు. సినీ పరిశ్రమలోని మిగతా నటీనటులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటే బావుంటుంది.