Begin typing your search above and press return to search.

రామానాయుడి పిలుపు.. ఓ జీవితం ఇచ్చింది

By:  Tupaki Desk   |   3 July 2016 5:23 AM GMT
రామానాయుడి పిలుపు.. ఓ జీవితం ఇచ్చింది
X
టాలీవుడ్ ఆడియన్స్ కి జయ ప్రకాష్ రెడ్డి పేరుతో పరిచయం అక్కర్లేదు. రాయలసీమ యాసను అంత అద్భుతంగా పలకగలిగే కేరక్టర్ ఆర్టిస్ట్ మరొకరు లేరనడంలో సందేహం కూడా ఉండదు. అయితే.. ఇంత గుర్తింపు దక్కించుకున్న జేపీ ఆర్థిక కష్టాలతో కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఛాన్సులు రాకపోవడం.. వచ్చినా డబ్బులు రాకపోవడంతోనే టాలీవుడ్ కి ఐదేళ్లు దూరమయ్యాడట జయప్రకాశ్ రెడ్డి.

తొలిసినిమానే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేసినా.. ఆ తర్వాత బ్రేక్ రాకపోవడంతో.. తిరిగి ఊరెళ్లిపోయి టీచర్ ఉద్యోగం చేసుకున్నాడట జేపీ. అలాంటి సమయంలో అపోలో ఆస్పత్రికి వచ్చినపుడు రామానాయుడుకి కనిపించడంతో ఆయన పిలిచి.. 'మంచి కేరక్టర్ ఉంది - వెళ్లి సురేష్ ని కలువు' అని చెప్పారట. అలా వచ్చిన అవకాశమే ప్రేమించుకుందాం రా మూవీలోని రోల్. ఈ పాత్ర స్వభావం విన్నాక.. రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ని కలిసి సీమ మాండలికంలో మాటలు ఉంటే బాగుంటుందని జేపీ సూచించాడట. నిర్మాతతో మాట్లాడి ఓకే అనిపించుకున్నాక.. అనంతపురం వెళ్లి మరింతగా ఆ యాసపై పట్టు సాధించి మరీ.. ప్రేమించుకుందాం..రా మూవీలో పాత్రను చేశాడట జేపీ. అది క్లిక్ అయినా విపరీతంగా ఛాన్సులేమీ రాలేదన్న జేపీ.. శ్రీరాములయ్య.. సమరసింహా రెడ్డి ల తర్వాత ఇక వెనుతిరిగి చూసుకోలేదని అంటున్నాడు.

సీనియర్ దర్శకులయినా.. కొత్త డైరెక్టర్లు అయినా ఒకే రకంగా విలువ ఇస్తానంటున్న జేపీ.. నైట్ షూటింగులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని చెప్పేశాడు. ఇండస్ట్రీలో తనకు పెద్దగా స్నేహితులు లేరని.. అయితే ఎమ్మెస్ నారాయణతో మాత్రం ఒరేయ్ అని పిలిపించుకునే సాన్నిహిత్యం ఉందంటున్నాడు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జేపీ.