Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: 'జయమ్మ పంచాయతీ' కి రమ్మంటున్న సుమక్క..!

By:  Tupaki Desk   |   6 Nov 2021 4:07 PM GMT
ఫస్ట్ లుక్: జయమ్మ పంచాయతీ కి రమ్మంటున్న సుమక్క..!
X
తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై తిరుగులేని వ్యాఖ్యాతగా రాణిస్తున్న సుమ.. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే చేసింది. అప్పుడప్పుడు సినిమాల్లో యాంకర్ గా తళుక్కున మెరిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి సినిమాతో వెండితెర మీద సందడి చేయడానికి వస్తోంది. సుమ ప్రధాన పాత్రలో ఓ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయింది. ఈ సినిమాకి ''జయమ్మ పంచాయతీ'' అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

'జయమ్మ పంచాయతీ' సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను ఈరోజు శనివారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ''సుమ గారూ.. మీరు ప్రతి తెలుగు ఇంట్లో అత్యంత ఇష్టపడే పేరు. ఇప్పుడు 70mm స్క్రీన్‌ పైకి వచ్చే సమయం వచ్చింది. సుమ గారికి మరియు మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు'' అని చరణ్ ట్వీట్ లో పేర్కొన్నారు.

'జయమ్మ పంచాయతీ' మోషన్ పోస్టర్ లో ఓ కొండ మీద గుడి - ఓ ఫ్యామిలీ - యువ ప్రేమజంట - మావోయిస్టులు - పోలీస్ స్టేషన్ - ఊరి జనాలు - చెట్టుకు వేలాడుతున్న మనుషులు.. ఇలా వీళ్లందరినీ చూపిస్తూ చివరగా సుమ లుక్ ని రివీల్ చేశారు. ఆ తర్వాత సుమ గట్టిగా రోకలితో దంచగా రోలు కూడా నెర్రెలు కొట్టడం గమనించవచ్చు. ఊరి మొత్తాన్ని ఆమె చీరకొంగు మీద చూపించడాన్ని బట్టి చూస్తే.. జయమ్మ తన కొంగు మీద అందరినీ ఆడిస్తుందేమోనని.. గ్రామంలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా జయమ్మ పంచాయితీకి వస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కాగా, 'జయమ్మ పంచాయతీ' సినిమాకి విజయ్ కుమార్ కలివరపు కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. విజయలక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.