Begin typing your search above and press return to search.

కొత్త టీజర్ కుమ్మేసిందిగా..

By:  Tupaki Desk   |   5 Nov 2016 11:30 AM GMT
కొత్త టీజర్ కుమ్మేసిందిగా..
X
తొలి సినిమా ‘జయం’తోనే స్టార్ అయిపోయాడు తెలుగువాడైన తమిళ హీరో రవి. తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న రవి.. ఆ తర్వాత అన్న మోహన్ రాజా కాంబినేషన్లో రీమేక్ సినిమాలతోనే ఎదిగాడు. ఐతే హీరోగా మంచి రేంజిలో ఉండగా అతణ్ణి వరుస ఫ్లాపులు ఉక్కిరి బిక్కిరి చేశాయి. గత ఏడాది ఆగస్టు 28 ముందు వరకు జయం రవిని తమిళ జనాలు పట్టించుకునే పరిస్థితే లేదు. కానీ ఆ రోజు విడుదలైన ‘తనీ ఒరువన్’ అతడి కెరీర్నే మలుపు తిప్పింది. తమిళంలో పెద్ద పెద్ద హీరోలకు కూడా దిమ్మదిరిగిపోయేలా భారీ వసూళ్లు రాబడుతూ బ్లాక్ బస్టర్ హిట్టయింది ఈ సినిమా. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది హీరో జయం రవి.. విలన్ అరవింద్ స్వామిల కాంబినేషన్.. వాళ్ల కెమిస్ట్రీనే.

ఆ సినిమాలో శత్రువులుగా ఉన్న రవి.. అరవింద్ ఇప్పుడు స్నేహితులుగా మారిపోయి ఓ సినిమా చేస్తున్నారు. అదే.. బోగన్. ఈ చిత్రానికి ప్రభుదేవా నిర్మాత కావడం విశేషం. ఇంతకుముందు జయం రవితో ‘రోమియో జూలియట్’ అనే సినిమా తీసిన లక్ష్మణన్ దర్శకుడు. ‘బోగన్’ టీజర్ తాజాగా రిలీజైంది. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్ తమిళనాట హాట్ టాపిక్ అవుతోంది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని లక్ష్మణన్ తీర్చిదిద్దిన తీరు టీజర్లో స్పష్టంగా కనిపిస్తోంది. జయం రవి.. అరవింద్ స్వామి కెమిస్ట్రీ ఇందులో మరింత బాగా పండినట్లుగా కనిపిస్తోంది. టీజర్ చివర్లో కొసమెరుపు కూడా భలే ఫన్నీగా ఉంది. రవి.. హన్సిక కలిసి రొమాన్స్ కూడా ఓ రేంజిలో పండించినట్లున్నారు. ఈ డిసెంబర్లోనే ‘బోగన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారట.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/