Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ:‘జవాన్’

By:  Tupaki Desk   |   1 Dec 2017 2:27 PM GMT
మూవీ రివ్యూ:‘జవాన్’
X
‘జవాన్’ మూవీ రివ్యూ
నటీనటులు: సాయిధరమ్ తేజ్-మెహ్రీన్-ప్రసన్న-కోట శ్రీనివాసరావు-జయప్రకాష్-సుబ్బరాజు-ఈశ్వరీరావు-నాగబాబు-సత్యం రాజేష్-అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్
నిర్మాత: కృష్ణ
రచన-దర్శకత్వం: బి.వి.ఎస్.రవి

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్.. దర్శకుడిగా తొలి సినిమా ‘వాంటెడ్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న బి.వి.ఎస్.రవి కలిసి చేసిన సినిమా ‘జవాన్’. టీజర్.. ట్రైలర్ తో ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: జై (సాయిధరమ్ తేజ్) కుటుంబం కంటే దేశం గొప్పదని భావించే కుర్రాడు. ఆర్ఎస్ఎస్ లో శిక్షణ పొందిన అతడికి నరనరాన దేశభక్తి ఉప్పొంగుతూ ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు డీఆర్డీవోలో ఉద్యోగం సాధించాలని కష్టపడుతుంటాడు. ఇక జైతో పాటు స్కూల్లో చదువుకున్న కేశవ (ప్రసన్న) అతడికి పూర్తి విరుద్ధం. అతడి డబ్బే అన్నింటికంటే ముఖ్యం. అందుకోసం ఏమైనా చేస్తాడు. దేశాన్ని దెబ్బ తీయడానికైనా సిద్ధపడతాడు. అతను టెర్రరిస్టులతో చేతులు కలిపి డీఆర్డీవో దేశం కోసం కొత్తగా తయారు చేసిన ప్రమాదకర ఆయుధాన్ని దొంగిలించడానికి పన్నాగం పన్నుతాడు. ఆ ప్రయత్నానికి జై అడ్డు పడతాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. ఈ పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: కుటుంబం ఏమైనా పర్వాలేదు సొసైటీ కోసం బతకాలనే హీరో ఒకవైపు.. సొసైటీ ఏమైనా పర్వాలేదు తన ప్రయోజనాలే ముఖ్యమనుకునే విలన్ ఓవైపు.. ఈ ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ నేపథ్యంలో సాగే సినిమా ‘జవాన్’. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మధ్య ఇది కొంచెం భిన్నమైన సినిమానే. కానీ ఇది కొత్త తరహా సినిమా మాత్రం కాదు. ‘జవాన్’ చూస్తున్నంతసేపూ ‘తుపాకి’.. ‘ధృవ’లతో పాటు గౌతమ్ మీనన్ సినిమా ‘ఎంతవాడు గాని’ లాంటివి గుర్తుకు రాక మానవు. మామూలుగా చూస్తే ‘జవాన్’ ఎలా అనిపించేదో కానీ.. చాలా గ్రిప్పింగ్ గా.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగిన పై సినిమాలు చూశాక ‘జవాన్’ ఓ సగటు సినిమాలా అనిపిస్తుందతే.

మొదట్నుంచి కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేస్తూ సినిమాలు చేసిన రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ కూడా ‘ధృవ’ సినిమాకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయాడు. ఇలాంటి సినిమాలకు ఏ డీవియేషన్లూ ఉండొద్దని భావించి.. కమర్షియల్ హంగులకు దూరంగా ఉన్నాడు. కథతో పాటే సాగిపోయాడు. కానీ ‘జవాన్’ టీం మాత్రం అలా చేయలేదు. కథ.. పాత్రల విషయంలో సిన్సియారిటీ చూపించినప్పటికీ.. కమర్షియల్ హంగుల కోసం తాపత్రయపడింది. కథ సీరియస్‌ గా.. ఆసక్తికరంగా ముందుకు సాగుతున్నపుడు సీన్లోకి హీరోయిన్ని దిగుతుంది. ఇద్దరూ కలిసి ఒకసారి డ్యూయెట్ కోసం ఫారిన్ లొకేషన్ కు వెళ్లిపోతారు. ఇంకోసారి మాస్ సాంగ్ వేసుకుంటారు. ప్రేక్షకులు ఆ మూడ్ నుంచి బయటికి వచ్చి మళ్లీ కథలోకి ఇన్వాల్వ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తుల మీద కథను నడపాలనుకున్నపుడు.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించాలనుకున్నపుడు.. అదే సినిమాకు ఆకర్షణగా భావించినపుడు.. ఇలాంటి హంగుల కోసం వెంపర్లాట ఎందుకు?

ఆ పోలికలు.. ఈ డీవియేషన్ల సంగతి వదిలేసి.. మిగతా విషయాల్లోకి వస్తే.. 135 నిమిషాల నిడివిలో ‘జవాన్’ చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. తన కుటుంబం నాశనమైపోయినా పర్వాలేదు.. దేశం బాగుండాలని కోరుకునే కుర్రాడిగా హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం ‘జవాన్’కు ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రకు సాయిధరమ్ తేజ్ చాలా బాగా సూటయ్యాడు కూడా. విలన్ పాత్ర కూడా మొదట్లో బాగానే అనిపిస్తుంది. ఈ రెండు పాత్రల పరంగా వైరుధ్యం.. ఇద్దరి మధ్య సంఘర్షణకు దారి తీసే పాయింట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. హీరో పాత్రను ఓ బిల్డప్ ఇచ్చి మొదట్లో పైకి లేపి.. తర్వాత కింద పడేయకుండా.. హడావుడి లేకుండా సింపుల్ గా మొదలుపెట్టి.. దాన్ని బిల్డ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. హీరో పాత్రలోని సిన్సియారిటీని చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. కాబట్టే ద్వితీయార్ధంలో దేశం గురించి.. దేశభక్తి గురించి డైలాగులు చెబుతుంటే ఎబ్బెట్టుగా అనిపించదు. అవి హృదయాన్ని హత్తుకునేలా.. ఆలోపించజేసేలా ఉంటాయి.

హీరో-విలన్.. పాత్రల పరిచయం తర్వాత ఇద్దరూ ఎవరికి వారుగా రంగంలోకి దిగి తమ లక్ష్యం కోసం సాగే క్రమంలో వచ్చే సన్నివేశాల్ని ఆసక్తికరంగానే నడిపాడు దర్శకుడు. విలన్ మిషన్ని హీరో దెబ్బ తీసే సీన్ మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది. కొంచెం సినిమాటిగ్గా అనిపించినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ప్రథమార్ధం ద్వితీయార్ధం మీద అంచనాలు పెట్టుకునేలా చేస్తుంది. కానీ రెండో అర్ధంలో హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్ అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. ఒక దశ దాటాక విలన్ పాత్రను తేల్చేశారు. విలన్ హీరో పక్కనే ఉండటం అన్నది కొత్త పాయింటే అయినా.. ఇద్దరి మధ్య ఎత్తులు పైఎత్తుల్లో అంత కొత్తదనం.. ఉత్కంఠ లేకపోయింది. ఇక్కడ సినిమా సాగతీతగా అనిపిస్తుంది. అందులోనూ ప్రి క్లైమాక్స్ దగ్గర్నుంచి హడావుడిగా ఏదో అలా లాగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.

విలన్ గుట్టును హీరో పట్టేసే సీన్ అంతగా పేలలేదు. క్లైమాక్స్ కూడా అలాగే తయారైంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్ని ఇంత సింపుల్ గా తేల్చేయడం ప్రేక్షకులకు రుచించదు. ఇలాంటి సన్నివేశాల్లో దర్శకుడి నుంచి మరింత బ్రిలియన్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాదిరి ఈ సన్నివేశాల్ని డీల్ చేశాడు రవి. ఇక డీఆర్డీవో నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా మామూలుగా అనిపిస్తాయి. ఇంకాస్త డీటైల్ గా.. కన్విన్సింగ్ గా ఈ సన్నివేశాలు తీర్చిదిద్దాల్సింది. దేశ అమ్ముల పొదిలో ఒక పెద్ద అస్త్రాన్ని చేరుస్తున్నపుడు దాన్ని మామూలుగా ఒక కంటైనర్ వెహికల్లో పంపించడం.. దాని మీద విలన్ అటాక్ చేయడం అన్నది అసహజంగా అనిపిస్తుంది. ఈ ప్రతికూలతల్ని పక్కన పెడితే.. చాలా వరకు బోర్ కొట్టించకుండా సాగిపోవడం ‘జవాన్’కు ఉన్న ప్లస్ పాయింట్. తేజు-రవిలకు మరీ గొప్ప ఫలితాన్నివ్వకపోయినా.. వాళ్లిద్దరి గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా మెరుగ్గానే అనిపిస్తుంది.

నటీనటులు: సాయిధరమ్ తేజ్ కొత్తగా కనిపిస్తాడు ‘జవాన్’లో. అతడి లుక్.. నటన అన్నీ మెరుగయ్యాయి. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో తేజుకు ఇది బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. ఎక్కడా అతి లేకుండా పద్ధతిగా పాత్రకు తగ్గట్లు సిన్సియర్ గా నటించాడతను. తేజ్ నటనలో పరిణతి కనిపిస్తుంది. సినిమాలో పాటలు ఏమాత్రం సింక్ అయ్యాయి అన్నది పక్కన పెడితే అభిమానులకు నచ్చేలా డ్యాన్సులు కూడా అదరగొట్టాడు తేజ్. విలన్ పాత్ర అనుకున్నంత బాగా లేకపోయినప్పటికీ ప్రసన్న నటనకు వంకలు పెట్టడానికేమీ లేదు. అతను కూడా సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరోయిన్ మెహ్రీన్ ఓకే. అందంగా.. బబ్లీగా కనిపించింది. పాటల్లో.. ముఖ్యంగా ‘బుగ్గంచున’లో చాలా గ్లామరస్ గా కనిపించి కుర్రాళ్లను అలరించింది. కోట శ్రీనివాసరావు.. సుబ్బరాజు.. జయప్రకాష్.. నాగబాబు.. వీళ్లంతా పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతికవర్గం: తమన్ సంగీతం ‘జవాన్’కు పెద్ద ప్లస్. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. తమన్ కెరీర్లో బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాల్లో ‘జవాన్’ ఒకటిగా నిలుస్తుంది. చాలా సన్నివేశాల్ని నేపథ్య సంగీతంతో నిలబెట్టాడు తమన్. కె.వి.గుహన్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బి.వి.ఎస్.రవి రచయితగా.. దర్శకుడిగా యావరేజ్ మార్కులు వేయించుకుంటాడు. అతను ఎంచుకున్న కథ ఓకే. హీరో పాత్రను బాగా తీర్చిదిద్దాడు. కొన్ని చోట్ల మంచి డైలాగులు రాశాడు. ముఖ్యంగా దేశభక్తితో ముడిపడ్డ మాటలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే మరింత బిగువుగా రాసుకోవాల్సింది. ద్వితీయార్ధం.. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే ‘జవాన్’ రవికి మెమొరబుల్ ఫిలిం అయ్యుండేదే.

చివరగా: జవాన్.. జస్ట్ ఓకే థ్రిల్లర్!

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre