Begin typing your search above and press return to search.

వెంకీని లైన్లో పెట్టే ప్రయత్నంలో 'జాతిరత్నాలు' డైరెక్టర్!

By:  Tupaki Desk   |   20 Sep 2021 3:30 AM GMT
వెంకీని లైన్లో పెట్టే ప్రయత్నంలో జాతిరత్నాలు డైరెక్టర్!
X
ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్లలో కామెడీని పట్టుగా నడిపించడంలో అనిల్ రావిపూడి ముందు వరుసలో కనిపిస్తాడు. 'జాతిరత్నాలు' సినిమా చూసిన తరువాత, కామెడీ పల్స్ తెలిసిన మరో యంగ్ డైరెక్టర్ వచ్చేశాడని అంతా చెప్పుకున్నారు. నిజానికి నవరసాలలో కామెడీనే కష్టమైనది. కామెడీతో అవతలవారిని మెప్పించడం చాలా కష్టం. నవ్వించడమంటే ఏడిపించడమంత వీజీ కాదని అందుకనే అంటూ ఉంటారు. అలాంటి కామెడీని తనదైన శైలిలో అనుదీప్ నడిపించాడు.

అనుదీప్ దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే కామెడీ కంటెంట్ ను ఎంచుకోవడం సాహసమేనని చెప్పాలి. చాలా తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాను చేసిన దర్శకుడిగా ఆయనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది ఒక రికార్డును నమోదు చేసింది. దాంతో ఈ కుర్ర దర్శకుడితో సినిమాలు చేయడానికి నిర్మాతలు .. హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇక కామెడీని ఎక్కువగా ఇష్టపడే ప్రేక్షకులు కూడా అనుదీప్ నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండనుందనే విషయంపై ఆసక్తిని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే తమిళ హీరో శివకార్తికేయన్ తో ఒక ప్రాజెక్ట్ సెట్ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందనున్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. కానీ అది కేవలం ఒక రూమర్ మాత్రమేనని తేలింది. ఇక ఇప్పుడు మాత్రం ఆయన వెంకటేశ్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. ఆల్రెడీ వెంకటేశ్ కి అనుదీప్ కథను వినిపించడం పూర్తయిందనీ, మార్పులు .. చేర్పుల పరంగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

అనుదీప్ కి తన బలం .. బలగం కామెడీనే అనే విషయం అర్థమైపోయింది. అందువలన ఈ సారి కూడా ఆయన కామెడీ కథనే సిద్ధం చేసుకున్నాడట. ఈ కథకి వెంకటేశ్ అయితే కరెక్టుగా సెట్ అవుతాడని భావించిన అనుదీప్ ఆయనను సంప్రదించడం జరిగిందట. కామెడీ చేయడం వెంకటేశ్ కి కొట్టిన పిండి. గతంలో ఈ విషయాన్ని చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటి వెంకటేశ్ ను కనుక అనుదీప్ ఒప్పించగలిగితే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదు. మరి అనుదీప్ ను ఎంతగానో అభిమానించే నాగ్ అశ్విన్ నిర్మాతగా ఉంటాడో .. వేరే నిర్మాతలు ఎంట్రీ ఇస్తారో చూడాలి.