Begin typing your search above and press return to search.

'జాతిరత్నాలు' వెనకున్నది మెగాస్టార్ మూవీలే!

By:  Tupaki Desk   |   1 Sep 2022 3:50 AM GMT
జాతిరత్నాలు వెనకున్నది మెగాస్టార్ మూవీలే!
X
రైటర్ గా .. దర్శకుడిగా చాలా తక్కువ సమయంలోనే అనుదీప్ ఎక్కువ పేరును సంపాదించుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన 'జాతిరత్నాలు' భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాతోనే అనుదీప్ కి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత సినిమానే తమిళంలో శివ కార్తికేయన్ తో 'ప్రిన్స్ 'చేశాడు. తాజాగా ఆయన 'ఫస్టు డే ఫస్టు షో' సినిమాకి కథను అందించాడు. ఆయన స్నేహితులు వంశీధర్ - లక్ష్మీనారాయణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. చిరంజీవి చీఫ్ గెస్టుగా వచ్చిన ఈ వేదికపై అనుదీప్ మాట్లాడుతూ .. "ఈ సినిమాకి ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవిగారికి నేనూ థ్యాంక్స్ చెబుతున్నాను.

ఈ సినిమా మొదలయ్యేటప్పుడే నేనూ ఏడిద శ్రీరామ్ గారికి రెండు కండీషన్స్ పెట్టాను. ఒకటి కె విశ్వనాథ్ గారి దగ్గరికి తీసుకుని వెళ్లాలనీ, రెండవది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిగారిని పిలవాలని.

చిరంజీవి గారి కామెడీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. నవీన్ 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' కూడా చిరంజీవి గారి 'చంటబ్బాయ్'నుంచే వచ్చింది. 'జాతి రత్నాలు' సినిమాలో కామెడీ ఎలా క్రియేట్ చేయాలా అనుకున్నప్పుడు 'జేబుదొంగ' .. 'దొంగమొగుడు' వంటి సినిమాలను చూసి ఆ స్టైల్లో తయారు చేసుకోవడం జరిగింది. ఆ తరహా కామెడీ సినిమాలను మళ్లీ చిరంజీవిగారు చేయాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక అలీ మాట్లాడుతూ .. "మా అమ్మ నాకు జన్మనిస్తే, పూర్ణోదయా సంస్థ నాకు పునర్జన్మనిచ్చింది. ఏడిద నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ ఆశీస్సుల కారణంగా ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాను. ఈ సినిమా 'సీతాకోక చిలుక' అంతటి విజయాన్ని సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

చిరంజీవి అన్నయ్య ఆశీస్సులను అందుకున్న చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.