Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఫన్నీ సీన్స్ తో 'ఫన్'టాస్టిక్ గా ఉన్న 'జాతిరత్నాలు'

By:  Tupaki Desk   |   4 March 2021 11:45 AM GMT
ట్రైలర్ టాక్: ఫన్నీ సీన్స్ తో ఫన్టాస్టిక్ గా ఉన్న జాతిరత్నాలు
X
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ''జాతిరత్నాలు''. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ ‏గా నటిస్తున్న ఈ చిత్రంలో హాస్యనటులు రాహుల్ రామకృష్ణ - ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. స్వప్న సినిమాస్‌ బ్యానర్ పై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు 'చిట్టి నా బుల్ బుల్ చిట్టి' మరియు 'జాతిరత్నాలు' టైటిల్ సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయబడింది.

'టెన్త్ లో 60% ఇంటర్ లో 50% బీటెక్ లో 40%.. ఏందిరా ఇది' అని అంటుండగా.. 'అందుకే ఎమ్ టెక్ చేయలే అన్న' అంటూ నవీన్ బదులివ్వడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. 'లేడీస్ ఎంపోరియమ్ శ్రీకాంత్' అని పిలిపించుకుంటూ దాన్ని లేడీస్ ఎంప‌వ‌ర్ మెంట్ గా చెప్పుకునే పాత్రలో నవీన్ నవీన్ కనిపిస్తున్నాడు. 'మీ పేరు చెంపా?' అని హీరో అడగ్గా 'చెంప పగుల్తది' అని హీరోయిన్ సమాధానం ఇవ్వడం.. 'ఈ మొత్తం చంచల్ గూడ జైలులో బెస్ట్ బ్యాచ్ అంటే మాదే రా..' అంటూ వెన్నెల కిషోర్ చెప్పడం వంటివి నవ్వులు పూయిస్తున్నాయి. ఊరి నుంచి సిటీకి వెళ్లిన ముగ్గురు జాతిరత్నాలు, గ్రహచారం బాగలేక ఓ కేసులో జైలుకు వెళ్లడం.. దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది ఇందులో చూపించబోతున్నారు. ఇక ట్రైలర్ చివర్లో జడ్జిగా ఉన్న బ్రహ్మానందం 'మీ తరపున వాదించడానికి ఎవరైనా ఉన్నారా?' అని ప్రశ్నించగా.. ''మా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్'' అంటూ నవీన్ గంభీరంగా చెప్పే డైలాగ్ అలరిస్తోంది.

మొత్తం మీద 'జాతిరత్నాలు' ట్రైలర్ లో నవీన్ సీరియస్ గా చెప్పే ఫన్నీ డైలాగ్స్ తో 'ఫన్'టాస్టిక్ గా ఉందని చెప్పవచ్చు. ఈ హాస్యరత్నాలు రెండు నినిషాల్లోనే ఇంతలా నవ్విస్తే.. మరి రేపు థియేటర్స్ లో ఏ రేంజ్ లో నవ్వులు పూయిస్తారో చూడాలి. ఇందులో వెన్నెల కిషోర్ - బ్రహ్మానందంతో పాటుగా బ్రహ్మాజీ - మురళీ శర్మ - సీనియర్ నరేష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి రథన్ సంగీతం సమకూర్చారు. మనోహర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. అభినవ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.