Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘జాతి రత్నాలు’

By:  Tupaki Desk   |   11 March 2021 11:31 AM GMT
మూవీ రివ్యూ : ‘జాతి రత్నాలు’
X
చిత్రం : జాతి రత్నాలు

నటీనటులు: నవీన్ పొలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ-ఫారియా అబ్దుల్లా-మురళీ శర్మ-వెన్నెల కిషోర్-నరేష్-బ్రహ్మాజీ-బ్రహ్మానందం తదితరులు
సంగీతం: రథన్
ఛాయాగ్రాహణం: సిద్ధం మనోహర్
నిర్మాత: నాగ్ అశ్విన్
రచన-దర్శకత్వం: అనుదీప్ కేవీ

ఈ మధ్య కాలంలో ఏ చిన్న సినిమాకూ రాని క్రేజ్ సంపాదించుకుంది ‘జాతిరత్నాలు’. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయతో మంచి గుర్తింపు సంపాదించిన నవీన్ పొలిశెట్టికి తోడు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో అనుదీప్ కేవీ రూపొందించిన చిత్రమిది. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ కామెడీ ఫిలిం ప్రేక్షకులు కోరుకున్న స్థాయిలో నవ్వులు పంచిందో లేదో చూద్దాం పదండి.

కథ: శ్రీకాంత్ (నవీన్ పొలిశెట్టి).. శేఖర్ (ప్రియదర్శి).. రవి (రాహుల్ రామకృష్ణ) తెలంగాణలోని జోగిపేట అనే టౌన్లో సరదాగా తిరిగే కుర్రాళ్లు. ఆ టౌన్లో వీళ్లను మించిన ఆవారా గాళ్లు లేరనే పేరుంటుంది ముగ్గురికి. ఇక్కడుంటే తనకు ఎవరూ విలువ ఇవ్వట్లేదని హైదరాబాద్ కు వెళ్లి ఉద్యోగం తెచ్చుకుని తనేంటో చూపించాలనుకుంటాడు శ్రీకాంత్. అతడితో పాటే శేఖఱ్.. రవి కూడా సిటీకి పయనమవుతారు. అక్కడికెళ్లాక అనుకోకుండా ఈ ముగ్గురూ ఒక హత్యాయత్నం కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు నుంచి బయటపడటానికి వీళ్లు చేసిన ప్రయత్నాలేంటి.. తర్వాత జరిగిన పరిణామాలేంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ముందుగా ‘జాతిరత్నాలు’లో ఒక సన్నివేశం గురించి మాట్లాడుకుందాం. హీరోలుండే ఫ్లాట్లోకి బుల్లెట్ గాయంతో ఉన్న ఎమ్మెల్యే ఉన్నట్లుండి వచ్చి పడతాడు. ఆయనకి ప్రాణం ఉందో పోయిందో చూడమని నవీన్ అంటే.. తాగిన మత్తులో ఉన్న రాహుల్ రామకృష్ణ గుండె వైపు కాకుండా ఊపిరితిత్తులున్న వైపు చెవి పెట్టి విని గుండె కొట్టుకున్న శబ్దం రాలేదని చెప్పి మనిషి చచ్చాడంటాడు. దీంతో శవాన్ని పాతి పెట్టేద్దామని ఆ ముగ్గురూ ప్రయత్నిస్తుంటే.. పోలీసులొస్తారు. అప్పుడు చూస్తే ఆ ఎమ్మెల్యే బతికే ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు నవీన్ అంటాడు.. ‘‘ఒరేయ్ గుండె ఏ పక్క ఉంటుందో తెలవదారా.. మ్యాథ్స్ చదువుకోలేదా’’ అని. ఇక్కడ ఇదంతా చదువుతున్నపుడు.. ఊపిరితిత్తులున్న వైపు చూసి అతను చచ్చాడని చెప్పడమేంటి.. వీళ్లు నమ్మడమేంటి.. అంత సీరియస్ మేటర్లో ‘‘మ్యాథ్స్ చదువుకోలేదా’’ అంటూ జోక్ వేయడమేంటి అనిపిస్తుంది. ఇవే సన్నివేశాలు మరో సినిమాలో ఉంటే సిల్లీగా అనిపించొచ్చు. అవి చూసి ఇదేం సినిమా అంటూ తీసి పడేయొచ్చు. కానీ ‘జాతిరత్నాలు’లో మాత్రం ఈ ఎపిసోడ్ నడుస్తున్నపుడు నవ్వి నవ్వి అలసిపోవడం ఖాయం. అందుకు తగ్గ ‘టోన్’ సిద్ధం చేయడంలోనే ‘జాతిరత్నాలు’ ప్రత్యేకత దాగుంది.

‘జబర్దస్త్’ లాంటి కామెడీ షోల జోరులో వెండితెరపై కామెడీ పండించడం మహా కష్టంగా మారిపోయిన సమయంలో మన జీవితాల్లో రోజూ జరిగే విషయాల్ని.. మనం చూసే మనుషులనే తెరమీదికి తీసుకొచ్చి.. మనం పేల్చుకునే జోకులకు రంగులేమీ అద్దకుండా స్వచ్ఛంగా.. అందంగా ప్రెజెంట్ చేసి కడుపు చెక్కలయ్యేలా నవ్వించే సినిమా ‘జాతి రత్నాలు’. ‘‘చెప్పే మనిషిని బట్టి మాట విలువ మారిపోతుంది’’ అంటూ ‘అరవింద సమేత’లో ఒక డైలాగ్ ఉంటుంది. దీన్ని కొంచెం మార్చి చూస్తే.. ఒక మంచి జోక్.. వచ్చే సందర్భాన్ని బట్టి.. దాన్ని పేల్చే నటుడిని బట్టి.. దాని చుట్టూ అల్లిన సన్నివేశాన్ని ఎలాగైనా ప్రేక్షకులకు చేరొచ్చు. ‘జాతిరత్నాలు’లో జోకులన్నిటికీ కూడా ఈ మూడు అంశాలూ చాలా చక్కగా అమరాయి. తెరపై పాత్రలన్నీ చాలా మామూలుగా అనిపిస్తాయి. అలాగే మనం రోజూ స్నేహితుల మధ్య పేల్చుకునే జోకులు.. పంచులే తెరపైన వస్తుంటాయి కానీ.. అవి వచ్చే టైమింగ్ భలేగా కుదిరి ‘జాతిరత్నాలు’ నాన్ స్టాప్ గా నవ్విస్తుంది.

కథగా తీసుకుంటే ‘జాతిరత్నాలు’లో ఏ విశేషం కనిపించదు. అసలు ఇది ఒక నాన్ సీరియస్.. సిల్లీ సినిమా అని చెప్పొచ్చు. మనం ఏ దశలోనూ సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ కాలేని విధంగానే ‘జాతిరత్నాలు’ నడుస్తుంది. కానీ కానీ కథ గురించి పెద్దగా ఆలోచించని విధంగా ఆరంభం నుంచి నవ్వుల్లో ముంచెత్తడంతో మనకు సమయమే తెలియదు. కథ ఎటు పోతోందో కూడా పెద్దగా పట్టించుకోం. అలాగని వినోదం కోసం పెద్దగా హడావుడి కూడా చేయలేదు. సిచువేషనల్ కామెడీతో సన్నివేశాలు సాగిపోతాయి. మూడు ప్రధాన పాత్రలు.. వాటి స్వభావాలు.. వాటి అల్లరి నుంచే జెన్యూన్ ఫన్ జనరేట్ చేస్తూ సాగుతుంది ‘జాతిరత్నాలు’. దర్శకుడు అనుదీప్ కేవీ.. ప్రధాన పాత్రలను తీర్చిదిద్దడంలో నేేలవిడిచి సాము చేయకుండా మన టౌన్లలో జీవితాన్ని సీరియస్ గా తీసుకోకుండా స్నేహితులతో కలిసి జాలీగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లను అలాగే తీసుకొచ్చి తెర మీద పెట్టేస్తే.. ఆ పాత్రల్లోకి నవీన్ పొలిశెట్టి-ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ వాటికి ప్రాణం పోసేశారు. వీళ్లను చూస్తే హీరోలు అని కాకుండా మనకు తెలిసిన ముగ్గురు కుర్రాళ్లలాగే అనిపిస్తారు. ఆ కుర్రాళ్లు తమ నిజ జీవితంలో ఎలా ప్రవర్తిస్తారో అలా తెరమీద కనిపిస్తున్నట్లే ఉంటుంది. వాళ్ల అల్లరిని.. సరదాలనే కాదు.. వాళ్ల కష్టాల్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తాం.

ఆ పాత్రేంటి ఇలా ప్రవర్తిస్తోంది.. ఈ సీన్లో లాజిక్ లేదేంటి.. కథ ఏంటి ఎటెటో పోతోంది అని ఆలోచించకుండా.. కేవలం ఆయా సన్నివేశాల్లోని కామెడీని ఆస్వాదిస్తూ వెళ్తే ‘జాతిరత్నాలు’ ఎక్కడా బోర్ కొట్టదు. ముఖ్యంగా ప్రథమార్ధంలో అయితే ఈ సినిమా నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. ముగ్గురు హీరోలు ఎవరికి ఎవరూ తక్కువ కాకుండా ప్రేక్షకులకు గిలిగింతలు పెడతారు. వాళ్లకంటూ ఒక్కో స్పెషల్ క్యారెక్టరైజేషన్.. మేనరిజమ్స్ పెట్టడం కామెడీకి మరింతగా దోహదపడింది. హీరోయిన్ తో తాజ్ హోటల్లో ఉన్న హీరో.. ఇప్పుడొక ఫోన్ వస్తే బాగుంటుంది అనడం.. వెంటనే ఫోన్ రాగానే.. ‘‘మామా తాజ్ హోటల్లో ఉన్నా మళ్లీ చేస్తారా’’ అంటూ ఫోన్ పెట్టేసి పోజు కొట్టడం లాంటి సన్నివేశాలు చూస్తే.. ఇలాంటి జెన్యూన్ ఫన్ మన సినిమాల్లో ఎందుకు మిస్సవుతోంది అనిపిస్తుంది. హీరో హీరోయిన్లు ఒకరినొకరు ప్రేమిస్తున్న విషయాన్ని పరోక్షంగా చెప్పుకునే చిరు సన్నివేశం కూడా ‘జాతిరత్నాలు’లో హైలైట్ గా నిలుస్తుంది. ఇలాంటి మెరుపులు సినిమాలో బోలెడున్నాయి. ఐతే ముందే అన్నట్లు ఇది నాన్ సీరియస్ మూవీ అన్నది ఒక కంప్లైంట్ కావచ్చు. ఆరంభంలోనే సినిమా ‘టోన్’ ఎలాంటిదో ప్రేక్షకులకు ఒక ఐడియా వచ్చేసినప్పటికీ.. ద్వితీయార్ధంలో ఒక దశ దాటాక కొంచెం శ్రుతి మించిన భావన కలుగుతుంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ నుంచి తెరపై ‘సిల్లీతనం’ హద్దులు దాటినట్లనిపిస్తుంది. లాజిక్ పూర్తిగా పక్కకు వెళ్లిపోతుంది. అప్పటికే ‘జాతిరత్నాలు’ను ఎంజాయ్ చేస్తున్న వాళ్లకు అది పెద్ద ఇబ్బంది కాదు. ఈ వ్యవహారం అంతా ఎబ్బెట్టుగా అనిపిస్తే.. ఆ తరహా ప్రేక్షకులు ‘జాతిరత్నాలు’ ఆరంభం నుంచే ఇబ్బంది పడతారు. ఫ్యామిలీస్ ఈ సినిమాను ఏ మేర ఎంజాయ్ చేస్తారో చెప్పలేం కానీ.. యూత్ కు మాత్రం ‘జాతిరత్నాలు’ కచ్చితంగా ఒక ఫన్ రైడే.

నటీనటులు: ముగ్గురు హీరోల్లో ఎవరినీ తక్కువ చేయడానికి వీల్లేదు. ముగ్గురూ అదరగొట్టేశారు. ఐతే నవీన్ పొలిశెట్టి గురించి కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడిలో మనం తట్టుకోలేనంత టాలెంట్ ఉందని ‘జాతిరత్నాలు’లో తెలుస్తుంది. శ్రీకాంత్ పాత్రలో అతను ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. ఫలానా సన్నివేశం అని కాదు కానీ.. ఆద్యంతం అతను ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఏజెంట్ పాత్రతో తనదైన ముద్ర వేసిన అతను.. శ్రీకాంత్ క్యారెక్టర్ తో యూత్ గుండెల్లోకి దూసుకెళ్లిపోవడం ఖాయం. అతడి లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్.. కామెడీ టైమింగ్ అన్నీ కూడా అదిరిపోయాయి. ప్రియదర్శి.. రాహుల్ రామకృష్ణ ఈ తరానికి బెస్ట్ కమెడియన్లు అనిపించారు. ఇప్పటి యువతకు బాగా నచ్చేలా తమదైన శైలిలో నవ్వులు పంచారు. సినిమా అంతటా ఈ ముగ్గురిదే హవా. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా తన టిపికల్ అందంతో ఆకట్టుకుంది. ఆమె రెగ్యులర్ హీరోయిన్లతో పోలిస్తే భిన్నంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు ఆమె చక్కగా సరిపోయింది. తన నవ్వు ఎంతో ఆకట్టుకుంటుంది. నటన కూడా బాగుంది. మురళీ శర్మ.. నరేష్.. తనికెళ్ల భరణి.. బ్రహ్మాజీ.. తమ పరిధిలో బాగానే చేశారు. బ్రహ్మానందం చిన్న పాత్రలో కాసేపు నవ్వించారు.

సాంకేతికవర్గం: రధన్ మ్యూజిక్ సాంకేతికాంశాల్లో ప్రధాన ఆకర్షణ. చిట్టి నీ నవ్వే.. పాట చాలా బాగుంది. ఆ పాట అప్పుడే అయిపోయిందా.. ఇంకాసేపు ఉంటే బాగుండే అనిపిస్తుంది తెర మీద. మిగతా రెండు మూడు పాటలు సరదాగా సాగాయి. నేపథ్య సంగీతం కూడా సినిమా శైలికి తగ్గట్లు సాగింది. సిద్ధం మనోహర్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నాగ్ అశ్విన్ అభిరుచి సినిమా అంతటా కనిపిస్తుంది. ఇక దర్శకుడు అనుదీప్ కేవీ.. ఒక స్పెషల్ ఫిలిం మేకర్ లాగా కనిపిస్తాడు. అతడి స్క్రిప్టులో ఉన్న సహజత్వం.. స్వచ్ఛతే ఈ సినిమాకు బలాలు పాత్రలు.. సన్నివేశాల్లో జీవం కనిపించేలా అతను సినిమాను తీర్చిదిద్దాడు. కామెడీలో అతను ఒక కొత్త స్టైల్ క్రియేట్ చేశాడనడంలో సందేహం లేదు. తెలంగాణ యూత్ లో ఉండే ‘ఫన్’ను తెరపైకి తీసుకొచ్చిన దర్శకుల్లో అనుదీప్ ఒకడవుతాడు.

చివరగా: జాతిరత్నాలు.. నవ్వుల్లో ముంచెత్తుతారు

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre