Begin typing your search above and press return to search.

కమర్షియల్ టచ్ లేని జాను.. జనాలు చూస్తారా?

By:  Tupaki Desk   |   21 Jan 2020 8:07 AM GMT
కమర్షియల్ టచ్ లేని జాను.. జనాలు చూస్తారా?
X
ఈ మధ్య దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కే సినిమాలకు పెద్దగా ప్రచారం ఉండడం లేదు. ఆయన బ్యానర్లో తెరకెక్కిన కొన్ని చిన్న సినిమాలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు ఆంటే ఆటోమేటిక్ గా ప్రేక్షకుల దృష్టి ఆ సినిమాలపై ఉంటుంది కాబట్టి ప్రచారం కొంత తగ్గినా హైప్ ఉంటుంది. కానీ స్మాల్.. మీడియం రేంజ్ సినిమాలకు ప్రచారం చాలా కీలకం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'జాను' విషయమే తీసుకుంటే సూపర్ హిట్ సినిమా '96' కు రీమేక్ గా తెరకెక్కుతున్నప్పటికీ ప్రచారం లేదు పెద్దగా హైప్ కూడా లేదు.

అంతే కాదు.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతమేరకు కనెక్ట్ అవుతుంది అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. '96' స్లోగా సాగే కథ. మన రెగ్యులర్ తెలుగు సినిమాల్లో కనిపించే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సున్నితమైన భావోద్వేగాలతో సాగే కథ. తెలుగులో పెద్దగా మార్పులు లేకుండా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. విభిన్నమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కానీ నీరసంగా సాగే కథలను మాత్రం ఆదరించే అవకాశాలు తక్కువ. తమిళ.. మలయాళం ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు. మన తెలుగు ప్రేక్షకులకు కంటెంట్ తో పాటు కాస్త కమర్షియల్ టచ్ ఇవ్వాల్సిందే. స్లో గా ఉండే సినిమాలకు మంచి టాక్ వస్తే అందరూ బాగుంది అని మెచ్చుకుంటారు కానీ థియేటర్లకు మాత్రం వెళ్లరు. అందుకే మన ఫిలిం మేకర్స్ సినిమా తీసే సమయంలో ఏ సెక్షన్ ఆడియెన్స్ కోసం సినిమా తీస్తున్నామనే విషయంలో క్లారిటీగా ఉంటారు. మరి 'జాను' సినిమాకు టార్గెట్ ఆడియన్స్ ఎవరనేది అర్థం కావడం లేదు.

తమిళ ఒరిజినల్ దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్.. సమంతా ఈ సినిమా లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష చేసిన మ్యాజిక్ ఈ సినిమా లో శర్వా -సామ్ రిపీట్ చేస్తారేమో చూడాలి.