Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేసి తప్పు చేశానని ఫీల్ అవుతున్న బాలీవుడ్ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   22 July 2020 3:30 AM GMT
టాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేసి తప్పు చేశానని ఫీల్ అవుతున్న బాలీవుడ్ బ్యూటీ..!
X
సినీ అభిమానులు అతిలోక సుందరిగా పిలుచుకునే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దఢక్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. 'సైరాత్' అనే మరాఠీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించినంతగా విజయం సాధించలేదు. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఆ తర్వాత 'ఘోస్ట్ స్టోరీస్' అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. ఈ క్రమంలో జాన్వీ నటించిన తాజా చిత్రం 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్'. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ లో స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోందని ఆమె 'దఢక్' సినిమా రిలీజైనప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. జాన్వీ కూడా పలు ఇంటర్వ్యూలలో తెలుగు సినిమాల్లో నటించాలనే కోరికను వెలిబుచ్చింది. అలనాటి శ్రీదేవి కూతురుని తెలుగులో నటింపజేయాలని చాలామంది దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేసారు. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ చిరంజీవి - శ్రీదేవి కాంబినేషన్‌ లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ చేయాలని.. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ ని టాలీవుడ్ కి పరిచయం చేయాలని ప్రయత్నాలు చేశారు. కానీ వర్క్ అవుట్ అవలేదు. పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ముందుగా జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే డేట్స్ ఖాళీగా లేవని జాన్వీ ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో అనన్య పాండే వచ్చి చేరింది.

కాగా ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్ చేసి తప్పు చేశానని జాన్వీ తెగ ఫీలవుతోందట. ఎందుకంటే అమ్మడు బిజీ అని చెప్పి తెలుగు సినిమాలు వదులుకొని చేసిన సినిమాలన్నీ ఇప్పుడు థియేటర్‌ లో కాకుండా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. దీంతో సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటాలనుకున్న జాన్వీకి ఇప్పుడు నిరాశే మిగిలింది. ఇప్పటికే 'గుంజన్ సక్సేనా' ఓటీటీలో రిలీజ్ అవుతుండగా రాజ్ కుమార్ రావ్ తో నటించిన 'రూహి అఫ్జనా' మూవీ కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తారు అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఆఫర్స్ ఓకే చేసి ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరించేవారని.. పెద్ద సినిమాలు కాబట్టి కొంచెం లేట్ అయినా థియేటర్స్ లోనే రిలీజ్ చేసే వారని తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోయిందట. మరి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని న్యూస్ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాలీవుడ్ లో అడుగుపెడుతుందేమో చూడాలి.