Begin typing your search above and press return to search.

జంధ్యాల మళ్లీ పుట్టాలి: పరుచూరి గోపాలకృష్

By:  Tupaki Desk   |   15 July 2021 9:50 AM GMT
జంధ్యాల మళ్లీ పుట్టాలి: పరుచూరి గోపాలకృష్
X
తెలుగు తెరపై హాస్య కథలను పరుగులు తీయించిన దర్శకులలో 'జంధ్యాల' ముందువరుసలో కనిపిస్తారు. సాధారణంగా సినిమాల్లో హాస్యం అప్పుడప్పుడూ .. అక్కడక్కడా పలకరించి వెళుతుంటుంది. కానీ ఆద్యంతం హాస్యాన్నే కథగా చేసిన నడిపించిన ఘనత జంధ్యాలకి దక్కుతుంది.

ఆయన సినిమాలు మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటాయి .. నవ్వుకుంటూనే థియేటర్ బయటికి వచ్చేలా చేస్తుంటాయి. అలాంటి జంధ్యాలను తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో గుర్తుచేసుకున్నారు. ఆయన గురించి తనకి తెలిసిన విషయాలను చెప్పుకొచ్చారు.

"జంధ్యాల గారు ఎంత గొప్ప రచయితనో .. అంత గొప్ప దర్శకుడు. ఆయన మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సకలకళా వల్లభన్. కానీ తెలుగు సినిమా పరిశ్రమ ఆయనకి ఇచ్చిన బిరుదు మాత్రం 'హాస్య బ్రహ్మ'. నాకు తెలిసి 'అహ నా పెళ్లంట' తరువాత ఆయనకి ఆ బిరుదు వచ్చి ఉంటుంది. 'అహ నా పెళ్లంట' సినిమా రామానాయుడిగారికి ఎంత డబ్బు తెచ్చిందో .. జంధ్యాలగారికి అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది. చిత్రపరిశ్రమకి మాకంటే ఆయన ఒక రెండు సంవత్సరాల ముందు వచ్చారు.

నాకు అందిన సమాచారం ప్రకారం జంధ్యాల గారు 250 సినిమాలకి పైగా రాసి ఉంటారు. తెలుగు సాహిత్యం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. తన పిల్లలకు ఆయన సాహితి - సంపద అనే పేర్లు పెట్టుకోవడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన పేరును ప్రస్తావించగానే నా గొంతు మూగబోతోంది. మంచి వయసులో ఉండగానే ఆయన వెళ్లిపోయారు.

ఆయన ఉండి ఉంటే మరిన్ని గొప్ప సినిమాలు వచ్చి ఉండేవి. ఆయన లేకపోవడం తెలుగు చిత్రపరిశ్రమకు భయంకరమైన నష్టం జరిగిందనే చెప్పాలి. ఒక మంచి దర్శకుడిని .. మంచి రచయితను మనం కోల్పోయాము.

తెలుగు సినిమా రచయితల సంఘానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. డీవీ నరసరాజుగారి మాదిరిగానే తెలుగు రచయితల సంఘాన్ని జంధ్యాల కాపాడుకుంటూ వచ్చారు. 'అడవిరాముడు' .. 'వేటగాడు' సినిమాలకు ఆయనే సంభాషణలు రాశారు. ఈ రెండు సినిమాల మధ్యలో ఆయన 'శంకరాభరణం' రాశారంటే ఎలా నమ్మబుద్ధి అవుతుంది? 'శంకరాభరణం' డైలాగులన్నీ కలిపి 24 పేజీలు ఉంటాయని అంటారు .. ఎంత గొప్పగా రాశారో చూడండి. అలా ఒక వైపున 'సప్తపది' .. 'సీతాకోకచిలుక' .. 'సాగర సంగమం' సినిమాలకు, మరో వైపున 'డ్రైవర్ రాముడు' .. 'ఆపద్బాంధవుడు' .. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాలకు ఆయన మాటలు రాశారు.

ఇలా వైవిధ్యభరితమైన కథలు .. సంభాషణలు రాయడం జంధ్యాల గారి గొప్పతనం. నాకు తెలిసి జంధ్యాలగారు 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ఎక్కువ భాగం విజయాలను సాధించినవే. వాటిలో 'పడమటి సంధ్యారాగం' సినిమాకి హ్యాట్సాఫ్ చెప్పవలసిందే. కె. విశ్వనాథ్ మనసుకు దగ్గరగా ఆయన మాటలు రాసేవారు.

అలాంటి మహా రచయితను కోల్పోవడం వలన ఆయన కుటుంబానికి ఎంత నష్టం జరిగిందో .. తెలుగు సినిమా పరిశ్రమకి కూడా అంతే నష్టం జరిగింది. మళ్లీ ఆయన తెలుగు సినిమా రచయితగానే పుట్టాలనీ, హాస్యభరితమైన కథలతో అలరించాలని మనసారా కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.