Begin typing your search above and press return to search.

రాజ‌మౌళికి మాటిచ్చిన హాలీవుడ్ పెద్ద‌న్న‌

By:  Tupaki Desk   |   21 Jan 2023 8:06 AM GMT
రాజ‌మౌళికి మాటిచ్చిన హాలీవుడ్ పెద్ద‌న్న‌
X
ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన పాన్ ఇండియా సంచ‌ల‌నం 'RRR '. టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ల తొలి క‌ల‌యిక‌లో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా దేశ వ్యాప్తంగానే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గానూ సంచ‌ల‌నాలు సృష్టించింది. ఏ ల‌క్ష్యంతో అయితే ఈ సినిమాకు రాజ‌మౌళి శ్రీ‌కారం చుట్టాడో ఆ ల‌క్ష్యం నెర‌వేర‌డ‌మే కాకుండా హాలీవుడ్ స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ అంతా ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకుని ఇండియ‌న్ సినిమా స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి చాటి చెప్పింది.

ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళిని ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యేలా చేసింది. గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారంతో పాటు 'RRR ' క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లోనూ స‌త్తా చాటి రెండు విభాగాల్లో పుర‌స్కారాల్ని ద‌క్కించుకుని ఒక్క సారిగా హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈ ప్ర‌తిష్టాత్కం ఆస్కార్ అకాడ‌మీకి షార్ట్ లిస్ట్ చేయ‌బ‌డిన సినిమాల్లోనూ 'RRR' చోటు ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి 24న ఫైన‌ల్ గా ఆస్కార్ బ‌రిలో నిలిచిన సినిమాలని ప్ర‌క‌టించ‌బోతున్నారు.

ఇక ఆస్కార్ కోసం మునుపెన్న‌డూ లేని విధంగా భారీ స్థాయిలో ఓటింగ్ జ‌ర‌గ‌డం, అత్య‌ధిక శాతం మంది ఈ ఓటింగ్ లో పాల్గొన‌డం తెలిసిందే. దీంతో తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో 'RRR' కు ఆస్కార్ గ్యారంటీ అనే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇండియా త‌రుపున మొత్తం ప‌ది సినిమాలు ఆస్కార్ కు ఎంట్రీని సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ప‌ది సినిమాల్లోనూ 'RRR' పేరు మాత్ర‌మే ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌గంతో 'RRR' టీమ్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది.

ఇదిలా వుంటే రాజ‌మౌళిపై హాలీవుడ్ ప్ర‌ముఖులు గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారానికి ముందు, త‌రువాత ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ సినిమాకు ఆస్కార్ గ్యారెంటీ అనే సంకేతాల్ని అందిస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం ద‌క్కించుకున్న అనంత‌రం జ‌రిగిన ఓ పార్టీలో రాజ‌మౌళి హాలీవుడ్ లో ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడిగా పేరు గాంచిన ద‌ర్శ‌కుడు స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ ని రాజ‌మౌళి ప్ర‌త్యేకంగా క‌లవ‌డం తెలిసిందే. స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ ని దేవుడితో పోల్చి కీర‌వాణితో క‌లిసి ఆయ‌న‌తో దిగిన ఫొటో ని రాజ‌మౌళి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకోవ‌డం.. అది వైర‌ల్ కావ‌డం తెలిసిందే.

అలాగే హాలీవుడ్ బ్ర‌హ్మ జేమ్స్ కెమెరూన్ ని క‌ల‌వ‌డం, ఆయ‌న‌తో ప‌ది నిఇషాల పాటు రాజ‌మౌళి మాట్లాడటం జ‌రిగింది. ఇదే విష‌యాన్ని తాజాగా రాజ‌మౌళి సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. తాజాగా 'RRR' టీమ్ జేమ్స్ కెమెరూన్ తో రాజ‌మౌళి సంభాషించిన వీడియోని కూడా అభిమానుల‌తో పంచుకుంది. ఇందులో 'మీరు ఎప్పుడైనా (హాలీవుడ్ లో) ఇక్క‌డ సినిమా చేయాల‌నుకుంటే మాట్లాడుకుందాం' అని జేమ్స్ కెమెరూన్.. రాజ‌మౌళితో అన‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడే ఇలా అన్నాడంటే 'RRR' ఖ‌చ్చితంగా ఆస్కార్ ని ద‌క్కించుకోవ‌డం లాంఛ‌న‌మే అనే కామెంట్ లు నెట్టింట వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.