Begin typing your search above and press return to search.

'జేమ్స్ కామెరూన్ ఆఫ్ ఇండియా' ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   30 May 2022 3:02 AM GMT
జేమ్స్ కామెరూన్ ఆఫ్ ఇండియా ఎవ‌రో తెలుసా?
X
భార‌తదేశానికి ఒక జేమ్స్ కామెరూన్ ఉన్నారు. అత‌డు ఎవ‌రో తెలుసుకోవాల‌నుందా? అయితే ఈ విష‌యం సంపూర్ణంగా తెలుసుకోవాలి. సినిమా అంటే ఒక గొప్ప వినోద సాధ‌నం. అంతేకాదు స‌మాజానికి దిశానిర్ధేశ‌నం చేసే గొప్ప సందేశాన్ని అందించే ఒక వేదిక అని నమ్ముతాడు అత‌డు. అందుకే తాను ఎంచుకునే ప్ర‌తి కాన్సెప్టు జ‌న‌రంజ‌కంగా ఉంటుంది. యువ‌త‌రంలో స్ఫూర్తి నింపుతుంది. కెరీర్ లో అప‌జ‌య‌మెరుగ‌ని ఫిలింమేక‌ర్ గా న‌టుడిగా అత‌డు అసాధార‌ణ విజ‌యాలు అందుకున్నాడు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ జాతీయ అవార్డులు అందుకున్నా ఆస్కార్ గ‌డ‌ప‌పై చివ‌రి అంకం వర‌కూ వెళ్లి జ‌స్ట్ లో అవార్డును మిస్స‌య్యాడు. అత‌డు ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నే లేదు. ది గ్రేట్ ఇండియ‌న్ ఫిలింమేక‌ర్.. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్.

అత‌డి ఆలోచ‌నా విధానం ఇత‌రుల‌తో పోలిస్తే చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఖాన్ ల త్ర‌యంలోనే అత‌డికి సాటి లేరు ఎవ‌రూ! వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమా తీయడంలో పేర్గాంచిన‌ మేధావి. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా భాషా భేధం లేకుండా సినీ ప్రేక్షకులు అతని చిత్రాలను ఆస్వాధిస్తున్నారు. అమీర్ ఖాన్ 150కోట్ల జ‌నాభా ఉన్న చైనాలోనూ సూపర్ స్టార్ అని నిరూపించారు. అత‌డు న‌టించిన‌ సినిమాలు దంగల్ (2016) - సీక్రెట్ సూపర్ స్టార్ (2017) పొరుగు దేశంలో బ్లాక్ బస్టర్ విజ‌యాలు అందుకున్న సంగ‌తి తెలిసిందే. దంగల్ చైనా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఇత‌ర పాశ్చాత్య దేశాల్లోనూ అమీర్ ఖాన్ సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. హాలీవుడ్ స్టార్స్ కూడా అతని చిత్రాలను ఆస్వాధిస్తారు. అత‌డిలోని ప్ర‌యోగాత్మ‌క‌త‌ను అభినందిస్తారంటే అర్థం చేసుకోవాలి.

ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు ఫిలింమేక‌ర్ టామ్ హాంక్స్ అమీర్ ఖాన్ కు ఆరాధ్యుడు అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అమీర్ ఖాన్ 2014 -15లో లెజెండ‌రీ హాలీవుడ్ ఫిలింమేక‌ర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ తో సమావేశం కావడానికి జర్మనీకి వెళ్లినప్పుడు టామ్ హ్యాంక్స్ ని కలుసుకున్నారు. అమీర్ ఖాన్ ఫారెస్ట్ గంప్ (1994)ని రీమేక్ చేయాలని భావించాడు. ఈ మూవీ రీమేక్ హక్కులు ఆ చిత్ర దర్శకుడు రాబర్ట్ జెమెకిస్ చేతిలో ఉన్నాయి. అయితే అమీర్ ను కలవడానికి రాబర్ట్ నిరాకరించాడు. సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు అమీర్ చాలా ప్రయత్నించినా ఫలించలేదు.

ఆ త‌ర్వాత ఇంకో ఆలోచ‌న లేకుండా అమీర్ ఖాన్ స్టీవెన్ స్పీల్ బర్గ్ ని కలవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ స‌మ‌యంలో తన చిత్రం బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్ (2015) షూటింగ్ లో ఉన్నాడు. ఆసక్తికరంగా ఈ చిత్రంలో టామ్ హాంక్స్ నటించారు. అతను ఫారెస్ట్ గంప్ లో కూడా నటించాడు. అతని పాత్రను అమీర్ రీమేక్ లో రాయాలనుకున్నాడు. అలాగే త‌న‌ని క‌లిసేందుకు ఇష్ట‌ప‌డ‌ని ద‌ర్శ‌కుడు రాబర్ట్ జెమెకిస్ స్పీల్ బర్గ్ ను ఎంతో గౌరవిస్తాడు. ఫలితంగా స్టీవెన్ స్పీల్ బర్గ్ రాబర్ట్ ను ఒప్పిస్తే `ఫారెస్ట్ గంప్` రీమేక్ హక్కులు త‌న సొంత‌మ‌వుతాయ‌ని తెలివిగా ఆలోచించాడు అమీర్. వెంట‌నే ప్ర‌ణాళిక‌ను అమ‌ల్లో పెట్టాడు.

`బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్` సెట్స్ కి చేరుకుని టామ్ హాంక్స్ ని కలిసి అనంత‌రం అమీర్ నేరుగా స్టీవెన్ స్పీల్ బర్గ్ ని కలిశాడు. స్టీవెన్ స్పీల్ బర్గ్ అమీర్ ను ఆ స‌మ‌యంలో టామ్ హాంక్స్ కు ‘జేమ్స్ కామెరూన్ ఆఫ్ ఇండియా’గా పరిచయం చేశాడు. ఎందుకంటే జేమ్స్ కామెరూన్ తన బాక్సాఫీస్ రికార్డులను ఎలా బద్దలు కొట్టాడో అలాగే అమీర్ కూడా ఇండియాలో అలా రికార్డులు సాధించాడ‌ని ప‌రిచ‌యం చేసారు. అయితే అమీర్ గురించి తనకు బాగా తెలుసునని టామ్ హాంక్స్ స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ కి స్పష్టం చేశాడు. అతను అమీర్ న‌టించిన‌ 2009 చిత్రం `3 ఇడియట్స్‌`ని ఇష్టపడ్డానని దానిని 3 సార్లు చూశానని కూడా అంగీకరించాడు.

చివ‌రికి తాను క‌ల‌వ‌క ముందే స్పీల్ బ‌ర్గ్ కి టామ్ హాంక్స్ కి కూడా అమీర్ తెలుస‌ని ఆ ఘ‌న‌ట రివీల్ చేసింది. అనంత‌రం అమీర్ ఖాన్ రాబర్ట్ జెమెకిస్ గురించి తన కష్టాల గురించి స్టీవెన్ స్పీల్ బర్గ్ కి ఖాన్ చెప్పాడు. దానికి స్పీల్ బర్గ్ వెంట‌నే స్పందించారు. జెమెకిస్ తో తన సంబంధం ఒక తండ్రి కొడుకుల అనుబంధం లాంటిదని అమీర్ కి చెప్పాడు. చాలా మంది తండ్రి కొడుకుల్లానే.. వారు కూడా ఎల్లప్పుడూ స‌ఖ్యత‌తో బాగా కలిసి ఉండరు! అమీర్ కి ముఖంపైనే ‘నో’ చెప్పడం ఇష్టం లేకనే త‌న‌ను కలవడానికి రాబర్ట్ జెమెకిస్ నిరాకరిస్తున్నట్లు కూడా స్పీల్ బ‌ర్గ్ అమీర్ కి వెల్లడించాడు.

చివ‌రికి స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్ కూడా చేతులెత్తేసినా అమీర్ ఖాన్ ప్రయత్నం ఆప‌లేదు. ఎట్టకేలకు రాబ‌ర్ట్ ని ఒప్పించి రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. ఫారెస్ట్ గంప్ రీమేక్ కి లాల్ సింగ్ చద్దా అనే టైటిల్ ని ఎంపిక చేసుకున్నాడు. ఈ చిత్రం 11 ఆగస్ట్ 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ రిలీజై ఆక‌ట్టుకుంది. అమీర్ మరో క్లాసిక్ తీసాడ‌న్న భ‌రోసాను ట్రైల‌ర్ ఇచ్చింది. ఈ సంవత్సరంలో అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. అయితే అమీర్ న‌టించిన ఈ చిత్రం చైనా మార్కెట్ ని వ‌దిలేస్తే.. భార‌త‌దేశంలో 1000 కోట్ల క్లబ్ ని అందుకుంటుందా? ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.