Begin typing your search above and press return to search.

ఆ సినిమా నుండి జక్కన్న తనయుడు తప్పుకున్నాడు..?

By:  Tupaki Desk   |   9 May 2020 4:20 PM IST
ఆ సినిమా నుండి జక్కన్న తనయుడు తప్పుకున్నాడు..?
X
దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తనయుడు కార్తికేయ తన తండ్రి చేసే ప్రాజెక్టులన్నిటిలో ప్రధాన పాత్ర వహిస్తుంటాడు. గతంలో 'బాహుబలి' సమయంలోనూ కార్తికేయ కష్టపడ్డాడని రాజమౌళి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరక్టర్ గా.. ప్రొడక్షన్ కంట్రోలర్ గా తన ప్రతిభ ఏమిటో చూపిస్తూ వస్తున్నాడు కార్తికేయ. అయితే ఆ మధ్య నిర్మాణ రంగంలోకి దిగి సినిమాలకు ప్రొడ్యూసర్ గా మారిన సంగతి తెలిసిందే. 'యుద్ధం శరణం' 'మత్తు వదలరా' తదితర చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఎస్‌.ఎస్‌.కార్తికేయ ప్రొడక్షన్స్ ద్వారా ‘ఆకాశ‌వాణి’ చిత్రానికి పూర్తి స్థాయి నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందించాడు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శకు చేరుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ‘ఆకాశ‌వాణి’ సినిమా నిర్మాణం నుండి కార్తికేయ త‌ప్పుకున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా దీనిపై కార్తికేయ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ సినిమా నిర్మాణం నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు.

కార్తికేయ ట్వీట్ చేస్తూ.. ''కొన్ని ప్రయాణాలు అనుకోకుండా అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. నా ఫ్రెండ్ డైరెక్టర్ అశ్విన్ గంగరాజుకి మరియు ఆకాశ‌వాణి చిత్ర బృందానికి శుభాకాంక్షలు'' అని ఒక లేఖని విడుదల చేసాడు. ఈ లేఖలో తాను ఎందుకు సినిమా నుండి తప్పుకున్నది వివరించే ప్రయత్నం చేసాడు. ఇకపై 'ఆకాశవాణి' నిర్మాణ బాధ్యతలను ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఎ.పద్మనాభరెడ్డికి అప్పగిస్తున్నానని పేర్కొన్నారు. మరో సినిమాకి తాను లైన్ ప్రొడ్యూసర్‌ గా పని చేస్తున్న నేపథ్యంలో రెండు సినిమాలకి సరైన సమయం కేటాయించలేకపోతున్నానని చెప్పాడు. అంతేకాకుండా దర్శకుడికి తనకు మధ్య కొన్ని సృజనాత్మక అంశాల్లో విభేదాలు వచ్చాయని.. మరొకరి ఆలోచనలైతే చిత్ర నిర్మాణానికి మరింతగా ఉపకరించవచ్చేమోనని భావించి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు కార్తికేయ వివరణ ఇచ్చుకున్నాడు. అనివార్య కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుండి ఇద్దరం విడిపోవలసి వచ్చింది. ఒకరిపై ఒకరికి తప్పక గౌరవం ఉంటుందని కార్తికేయ స్పష్టం చేసారు. ఈ సందర్భంగా 'ఆకాశవాణి' మొదలైనప్పటి నుండి తనకి అండగా నిలిచిన దర్శకుడు.. టీమ్ మెంబర్స్ అందరికి కృతజ్ఞతలు తెలిపాడు కార్తికేయ.