Begin typing your search above and press return to search.

జై భీమ్‌.. కోడి గుడ్డుపై ఈకలు పీకేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 Nov 2021 4:20 AM GMT
జై భీమ్‌.. కోడి గుడ్డుపై ఈకలు పీకేస్తున్నారు
X
ఈమద్య కాలంలో పబ్లిసిటీ కోసం వివాదాలను సృష్టించడం.. సినిమా ఇండస్ట్రీ వారిని విమర్శించడం ద్వారా పాపులారిటీ దక్కించుకోవడం చాలా కామన్ అయ్యింది. ఒకప్పుడు సినిమాల్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నా.. పాత్రలు ఉన్నా.. సన్నివేశాలు ఉన్నా కూడా పెద్దగా వివాదాలు అయ్యేవి కావు. కాని ఇప్పుడు ప్రతి చిన్న విషయం కూడా వివాదాస్పదం చేస్తున్నారు. కామెడీ చేసినా.. విలన్ గా చూపించినా.. మరేం చేసినా కూడా తమ మనోభావాలు దెబ్బ తీశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి విషయాన్ని కొందరు రాద్దాంతం చేస్తూ రచ్చ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరి ఆవేదనలో నిజం ఉన్నా కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీ వారిపై ప్రతి విషయంలో కూడా విమర్శలు చేసేందుకు కొందరు సోషల్‌ మీడియాలో రెడీగా ఉంటున్నారు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న జై భీమ్ సినిమాను ఇప్పుడు కొందరు తప్పుబడుతున్నారు. ఒక వర్గం వారి కష్టాలను చూపించడం కోసం మమ్ములను తక్కువ చేసి చూపించారు అంటూ జై భీమ్ సినిమా యూనిట్ సభ్యులపై తమిళనాడుకు చెందిన వనియార్ల సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. చెంచులను మరియు గిరిజనులను హింసించే పాత్రలో తమ కులం వ్యక్తిని చూపించారంటూ వారు ఆరోపిస్తున్నారు. కోర్టుకు వెళ్లిన వనియార్లు 5 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లుగా ప్రకటించారు. పోలీస్ స్టేషన్ సన్నివేశాల్లో చెంచులను చితకబాదే పోలీసు ఆఫీసర్‌ ను ప్రత్యేకంగా వనియర్‌ సామాజిక వర్గం అని చూపించలేదు. కాని పోలీస్ స్టేషన్ లో ఆ సామాజిక వర్గంకు సంబంధించిన చిహ్నంను ఉంచారు. దాంతో తమ కులంను ఆ విధంగా తప్పుగా చూపించారంటూ వారు విమర్శిస్తున్నారు.

సాదారణంగా అయితే అసలు ఆ విషయాన్ని జనాలు కనీసం నోటీసు కూడా చేయడం లేదు. వారు ఇప్పుడు ఈ వివాదం మొదలు పెట్టడం వల్ల విషయం తెలిసింది కాని సినిమా చూసిన ఏ ఒక్కరికి కూడా ఆ విషయం కనీసం మైండ్ కు తట్టలేదు. జై భీమ్ వంటి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలో అలాంటి ఒక చిన్న ఎలిమెంట్‌ ను పట్టుకోవడం ఏమాత్రం భావ్యం కాదు అంటూ తమిళ మీడియా వర్గాల వారు మరియు సినీ వర్గాల వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి సినిమా తమిళంలో రావడం ప్రతి ఒక్కరు గర్వించాల్సిన విషయం. అలాంటిది సినిమాపై పరువు నష్టం దావా వేయడం అనేది మంచి పద్దతి కాదంటూ కొందరు... ఎప్పటిలాగే కొందరు ఎలాంటి వివాదం లేకున్నా కూడా వివాదం పుట్టించి కోడిగుడ్డు మీద ఈకలు పీకేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కోర్టుకు చేరిన ఈ పరువు నష్టం దావా ఎంత వరకు వెళ్తుంది.. అసలు కోర్టు ఈ కేసును పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా అనేది చూడాలి. సీనియర్‌ న్యాయవాదుల అభిప్రాయం ప్రకారం కోర్టులో ఈ కేసు నిలవదు కాని కొన్ని రోజులు ఈ విషయం మీడియాలో హడావుడి చేస్తుందని అంటున్నారు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.