Begin typing your search above and press return to search.

సినిమా ఏదైనా స్లోగన్ మాత్రం 'జై బాలయ్య'

By:  Tupaki Desk   |   21 Dec 2021 3:30 PM GMT
సినిమా ఏదైనా స్లోగన్ మాత్రం జై బాలయ్య
X
నటసింహం నందమూరి బాలకృష్ణను ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు ''జై బాలయ్య''. తమ ఫేవరేట్ హీరో మీదున్న ప్రేమను చాటుకోడానికి నినదించే స్లోగన్ 'జై బాలయ్య'. సినిమా ఎలాంటిదైనా.. థియేటర్ ఏదైనా.. ఏ హీరో మూవీ అయినా ఈ స్లోగన్ మాత్రం కామన్ గా వినిపిస్తూ ఉంటుంది. ఎంతో మంది ఫ్యాన్స్ చేతుల మీద టాటూగా కనిపిస్తుంది.

సినిమా ఫంక్షన్స్ మొదలుకొని జాబ్ మేళాల వరకు.. ఇతర దేశాల్లో క్రికెట్ స్టేడియాలలో కూడా జై బాలయ్య అనే నినాదం వినిపిస్తుందంటే.. దానికి ఉండే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. జై బాలయ్య అంటే స్లోగన్ కాదు.. అదొక బ్రాండ్ అని నందమూరి అభిమానులు అంటుంటారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్స్ ఈ స్లోగన్ ను విపరీతంగా ఉపయోగిస్తుంటారు.

లేటెస్టుగా జై బాలయ్య స్లోగన్ గురించి తన అనుభవాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి వెల్లడించారు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షోకు రాజమౌళి - కీరవాణి గెస్టులుగా హాజరైన సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ ఎపిసోడ్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది.

ఇందులో కీరవాణి మాట్లాడుతూ.. ఒకసారి 'గ్రావిటీ' అనే ఇంగ్లీష్ సినిమాకు వెళ్ళాం. టైటిల్స్ లో జూమ్ బ్యాక్ ఉంటుంది. భూమితో స్టార్ట్ అయి విశ్వంలోకి తీసుకెళ్లినప్పుడు అందరూ 'జై బాలయ్య' అని అరిసారని చెప్పుకొచ్చారు. దీంతో బాలయ్య ఆశ్చర్యకరమైన ఫేస్ పెట్టగా.. పక్కనే ఉన్న జక్కన్న పెద్దగా నవ్వేశారు.

ఇకపోతే 'జై బాలయ్య' కు ఉండే క్రేజ్ దృష్ట్యా ఇటీవల 'అఖండ' సినిమాలో అదే లైన్స్ తో సాంగ్ పెట్టారు. అలానే ప్రస్తుతం నటసింహం నటించే సినిమాకు దాన్నే పేరుగా పెట్టాలని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ యాక్షన్ ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు 'జై బాలయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

ఇదిలా ఉంటే ఓటీటీ వేదికగా బాలకృష్ణ హోస్ట్ గా అదరగొడుతున్నారు. ఆహా లో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇప్పుడు తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న 5వ ఎపిసోడ్ కూడా మంచి ఆదరణ పొందుతోంది. రాజమౌళి - కీరవాణి లతో బాలయ్య సాగించిన సరదా సంభాషణ వీక్షకులను అలరిస్తోంది.

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రాబోతున్న 'అన్ స్టాపబుల్' 6వ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్టుగా హాజరు కానున్నారు. అలానే రాబోయే రోజుల్లో బాలకృష్ణ టాక్ షోలో మహేష్ బాబు - రవితేజ వంటి స్టార్ హీరోలు సందడి చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది.