Begin typing your search above and press return to search.

జై బాలయ్యా.. టూమచ్ గా లేదూ!

By:  Tupaki Desk   |   28 Aug 2017 10:20 AM GMT
జై బాలయ్యా.. టూమచ్ గా లేదూ!
X
మామూలుగానే సినీ పరిశ్రమలో వ్యక్తి పూజ ఎక్కువ. మన టాలీవుడ్లో అయితే అది మరీ ఎక్కువగా ఉంటుంది. స్టార్ హీరోల్ని పొగిడే తీరు మామూలుగా ఉండదు. ఒక సినిమాకు అత్యంత కీలకమైన వ్యక్తి దర్శకుడన్నది వాస్తవమే అయినా.. మన సినిమాలు మాత్రం అన్ని విధాలా హీరోల చుట్టూనే తిరుగుతాయి. హీరోల్ని మన దర్శకులు పొగిడే తీరు మామూలుగా ఉండదు. మామూలుగా డేరింగ్ అండ్ డాషింగ్ అన్నట్లుగా ఉండే పూరి జగన్నాథ్ తన హీరోల్ని పొగడ్డం తక్కువే కానీ.. తన కెరీర్ స్లంప్ లో ఉన్న సమయంలో అవకాశం ఇచ్చాడని బాలయ్యను అదే పనిగా పొగిడేస్తుండటం.. ‘జై బాలయ్య’ నినాదాలతో హోరెత్తించేస్తుండటం ఆయన అభిమానులకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తోంది.

‘పైసా వసూల్’ ప్రమోషనల్ ఈవెంట్లలో బాలయ్యను పూరి ఎలా పొగిడేస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ‘జై బాలయ్యా’ నినాదంతో ఒక వీడియో కూడా రెడీ చేయించాడు పూరి. తన మిత్రుడైన బాలీవుడ్ సంగీత దర్శకుడు సందీప్ చౌతాతో ఈ వీడియో చేయించడం విశేషం. ఆ వీడియో అంతటా ఒక బ్యాచ్ ‘జై బాలయ్యా.. జై బాలయ్యా’ వెర్రిగా ఊగిపోతూ ఉంటారు. మధ్య మధ్యలో ‘పైసా వసూల్’కు సంబంధించిన కొన్ని విజువల్స్ వేశారు. ఒక చోట ఒక వ్యక్తిని ఇంకొకరు లాగి పెట్టి కొడతారు. కానీ దెబ్బ తిన్న వ్యక్తి జై బాలయ్య జై బాలయ్యా అన్న నినాదాన్ని మాత్రం ఆపడు.

‘పైసా వసూల్’ ఆడియో వేడుకకు ముందు రోజు బాలయ్య ఓ అభిమానిని కొట్టడాన్ని ఉద్దేశించి ఈ విజువల్ పెట్టినట్లుంది. అంటే బాలయ్య చేత దెబ్బ తిన్న అభిమాని కూడా జై బాలయ్యా అనడం మానడని పరోక్షంగా చెప్పడం దీని ఉద్దేశం కావచ్చు. ‘పైసా వసూల్’ ఆడియో వేడుకలో బాలయ్య చెంపదెబ్బల వ్యవహారాన్ని వెనకేసుకురావడం ద్వారా విమర్శలెదుర్కొన్న పూరి.. ఇప్పుడు ఆ అంశాన్ని మరింత డైల్యూట్ చేసేందుకు ఈ వీడియో ద్వారా ప్రయత్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బాలయ్య మీద అభిమానం చూపించడం వరకు ఓకే కానీ.. మరీ ఈ స్థాయిలో బాధ్యత నెత్తికెత్తుకోవడం మాత్రం విడ్డూరమే.