Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘జాగ్వార్’

By:  Tupaki Desk   |   6 Oct 2016 10:05 AM GMT
మూవీ రివ్యూ : ‘జాగ్వార్’
X
చిత్రం : ‘జాగ్వార్’

నటీనటులు: నిఖిల్ గౌడ - దీప్తి సాతి - జగపతి బాబు - ఆదర్శ్ బాలకృష్ణ - సంపత్ - ఆదిత్య మీనన్ - బ్రహ్మానందం - రావు రమేష్ - సుప్రీత్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: అనితా కుమారస్వామి
స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: మహదేవ్

తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం.. ఒకేసారి తమిళ.. తెలుగు భాషల్లో రిలీజవడం మామూలే. ఐతే ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఓ కన్నడ సినిమా సమాంతరంగా తెలుగులోనూ తెరకెక్కింది. రెండు భాషల్లోనూ ఒకేసారి విడుదలైంది. అదే.. జాగ్వార్. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన కొడుకు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ఈ చిత్రానికి కథ అందించడం.. బాలయ్యతో ‘మిత్రుడు’ తీసిన మహదేవ్ దర్శకత్వం వహించడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రం ఆసక్తిని రేకెత్తించింది. మరి జాగ్వార్ విశేషాలేంటి.. కొత్త కుర్రాడు ఎలా ఉన్నాడు.. చూద్దాం పదండి.

కథ:

ఎస్.ఎస్.కృష్ణ (నిఖిల్ గౌడ) ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుంటాడు. ఆ కాలేజీలో సీనియర్ అయిన రవి (ఆదర్శ్ బాలకృష్ణ)ని పదే పదే ఉడికిస్తుంటాడు. ప్రేమ పేరుతో అతడి చెల్లెలైన ప్రియ (దీప్తి సాతి) వెంటపడుతుంటాడు. ఇలా అల్లా టప్పాగా కనిపించే కృష్ణ.. మరోవైపు మాస్క్ వేసుకుని హత్యలు చేస్తుంటాడు. తాను చేసే హత్యల్ని ఓ టీవీ ఛానెల్ ద్వారా లైవ్ లో చూపిస్తుంటాడు కూడా. ఈ హత్యల వెనుక ఎవరున్నారో తెలుసుకోవడానికి సీబీఐ ఆఫీసర్ (జగపతిబాబు) ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతకీ కృష్ణ బ్యాగ్రౌండ్ ఏంటి.. అతను ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నాడు అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

‘జాగ్వార్’ చూస్తున్నంతసేపు మనం ఓ ఐదు పదేళ్లు వెనక్కి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. తెలుగులో అరిగిపోయి పక్కన పడేసిన రివెంజ్ ఫార్ములా కథను పట్టుకుని.. ‘మిత్రుడు’ ఫేమ్ మహదేవ్ ‘జాగ్వార్’ మీద రూ.75 కోట్లు పెట్టించగలిగాడంటే గొప్ప విషయమే. కన్నడ సినిమా వాళ్లు మనకంటే ఓ దశాబ్దం వెనుక ఉంటారని అక్కడొచ్చే సినిమాల్ని బట్టి చెబుతుంటారు. బహుశా విజయేంద్ర ప్రసాద్ కూడా ఆ ఉద్దేశంతోనే ఈ కథ రాశారేమో అనిపిస్తుంది. హీరో చిన్నవాడిగా ఉండగా అతడి తండ్రిని విలన్లు మోసం చేయడం.. హీరో తండ్రి అవమాన భారంతో చనిపోవడం.. హీరో పెరిగి పెద్దవాడై సొసైటీలో బాగా ఎదిగిపోయిన విలన్ల గ్యాంగులో ఒక్కొక్కర్ని చంపుకుంటూ పోవడం.. తర్వాత ఫ్లాష్ బ్యాక్ ద్వారా అసలు విషయం రివీల్ కావడం.. చివర్లో ఓ భారీ క్లైమాక్స్.. ఇలా ఓ ఫార్ములా ప్రకారం సాగిపోయే సినిమా ‘జాగ్వార్’. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్.. టాప్ క్లాస్ యాక్షన్ సీక్వెన్సెస్ మినహాయిస్తే ‘జాగ్వార్’లో చెప్పుకోదగ్గ విశేషాలు లేవు.

విజయేంద్ర ప్రసాద్ చాలా వరకు పాత కథల్నే రీసైకిల్ చేస్తుంటారు. ఐతే రాజమౌళి వాటిని ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేసి మెప్పిస్తుంటాడు. ఐతే ‘జాగ్వార్’ కోసం విజయేంద్ర ప్రసాద్ మరీ పాత కథను రాయగా.. మహదేవ్ దాన్ని మరీ సాదాసీదాగా ప్రెజెంట్ చేశాడు. రాజమౌళిలో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయలేకపోయాడు మహదేవ్. అసలే తెలిసిన కథ అయితే.. దాన్ని ఆసక్తికరంగా చెప్పడంలోనూ విఫలమయ్యాడు దర్శకుడు. కథనంలో బిగి లేదు. ఉత్కంఠ లేదు. ఈ కథ మీద ప్రేక్షకుడు ఓ అంచనాకు రావడానికి ఎంతో సమయం పట్టదు. హీరో మొదట్లోనే మర్డర్ చేయడం.. ఆ తర్వాత మామూలు స్టూడెంట్ లాగా కాలేజీలోకి అడుగుపెట్టడంతోనే ఇతడి వెనుక ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. ఇది రివెంజ్ స్టోరీ కావొచ్చని ఓ అంచనాకు వచ్చేస్తాం.

కథ సంగతెలా ఉన్నా.. కథనమైనా ఆసక్తికరంగా ఉందా అంటే అదీ లేదు. అటు మర్డర్లు చేసి ఎస్కేప్ అవడం.. దాన్ని సీబీఐ ఆఫీస్ ఇన్వెస్టిగేట్ చేయడం సిల్లీగా సాగుతుంది. కాలేజ్ నేపథ్యంలో వచ్చే టీజింగ్ సీన్లు.. కామెడీ గురించైతే చెప్పనవసరం లేదు. ఓ సీన్లో హీరోయిన్ కుక్కను ఒక కమెడియన్ ఎత్తుకెళ్తాడు. దాన్ని హీరో తీసుకొచ్చి హీరోయిన్ కు ఇస్తాడు. ఆ కుక్క స్కెచ్ తీసుకుని తనను ఎత్తుకెళ్లినవాడి బొమ్మ గీసేస్తుంది. హీరోయిన్ హీరోకు పడిపోతుంది. ఇదీ ఇందులో ఓ రొమాంటిక్ కామెడీ సీన్ సాగే తీరు.

ఇలాంటి సన్నివేశాల సంగతెలా ఉన్నా.. యాక్షన్ సీన్లు బాగుండటం.. కెమెరా పనితనం.. ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకోవడం.. మరోవైపు విజయేంద్ర ప్రసాద్ కథలో ఏదో ఒక ప్రత్యేకత ఉండకపోదు అన్న అంచనాల మధ్య ప్రథమార్ధాన్ని ఎలాగోలా నడిపించేస్తాం. ద్వితీయార్ధం మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ ఇక్కడే ‘జాగ్వార్’ ట్రాక్ తప్పేసింది. శ్రీను వైట్ల ఫార్మాట్లో నడిచే ద్వితీయార్ధం తేలిపోయింది. హీరో వెళ్లి విలన్ ఇంట్లో తిష్ట వేయడం.. అక్కడ బ్రహ్మానందం రూపంలో ఓ బకరా వచ్చి చేరడంతో ఇక ఈ కథ ఎలా కంచికి చేరుతుందో పూర్తిగా బోధపడుతుంది.

తమన్నా పాట వచ్చేసరికే సినిమా ట్రాక్ తప్పుతుంది. తమన్నా తన అందచందాలతో.. నృత్యంతో ఆకటుకున్నప్పటికీ ఆ పాట కూడా అనుకున్నంత బాగా ఏమీ రాలేదు. ఇక ఇందులోని ఫ్లాష్ బ్యాక్.. క్లైమాక్స్ ఎన్ని తెలుగు సినిమాల్లో లెక్కల్లో చెప్పడం కష్టం. రూ.75 కోట్ల బడ్జెట్ అని చాలా గొప్పగా చెప్పుకున్నారు కానీ.. ఈ కథకు అంత ఖర్చు ఏమాత్రం అవసరం లేదు. ప్రతి సన్నివేశంలోనూ భారీ తనం గురించి ఆలోచించారే తప్ప.. ఎంత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం అని ఆలోచించినట్లు కనిపించదు. మాస్ ను మెప్పించే అంశాలు కొన్ని ఉన్నా.. ఓవరాల్ గా ‘జాగ్వార్’ నిరాశపరుస్తుంది.

నటీనటులు:

పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఒక కొత్త హీరో సినిమా అంటే.. కథాకథనాల కంటే ఆ హీరో ఎలా చేశాడన్న దానిపై ఆసక్తి నెలకొనడం సహజం. ఐతే చాలామంది అరంగేట్ర హీరోలు తమ ప్రత్యేకత ఎందులో చూపించాలనుకుంటారో.. నిఖిల్ కూడా అదే చేశాడు. డ్యాన్సులు.. ఫైట్లలో తన టాలెంట్ చూపించాడు. అతడి లుక్స్.. బాడీ లాంగ్వేజ్ ఏమంత బాగా లేవు. నటన కూడా అంతంతమాత్రమే. హావభావాల విషయంలో చాలా మెరుగవ్వాలి. హీరోయిన్ దీప్తి సాతి గురించి చెప్పడానికేమీ లేదు. జగపతి బాబును విలన్ పాత్రల్లోనే కాక సీబీఐ ఆఫీసర్ గా కూడా ‘స్టైలిష్’గా చూపించడానికి ప్రయత్నించారు. ఆయన పాత్ర చాలా సాదాసీదాగా ఉంది. ఆ పాత్ర సినిమాకు ఆకర్షణ కాలేకపోయింది. రమ్యకృష్ణ కనిపించేది కాసేపే అయినా ఆకట్టుకుంది. ఇంకా ఈ సినిమాలో చాలామంది తెలుగు ఆర్టిస్టులున్నారు. అందుకే ఇది కన్నడ సినిమా అన్న ఫీలింగ్ కలిగించదు. బ్రహ్మి కామెడీ గురించి చెప్పేదేముంది. సినిమాలాగే ఆయన క్యారెక్టర్.. కామెడీ కూడా రొటీనే. కీలక పాత్ర చేసిన ఆదర్శ్ బాలకృష్ణ ఆకట్టుకున్నాడు. సంపత్.. ఆదిత్య మీనన్.. రావురమేష్ సహా మిగతా వాళ్లంతా పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

సినిమాకు ప్రధాన ఆకర్షణ మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం. సినిమా అంతా రిచ్ గా కనిపించిందంటే అందులో కెమెరా పనితనం కీలకం. మనోజ్ ఎంచుకున్న లైటింగ్ బాగుంది. విజువల్స్ బాగున్నాయి. తమన్ సంగీతం పెద్దగా ఆకట్టుకోదు. పాటలేవీ కూడా రిజిస్టరవ్వవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. ముందే అన్నట్లు ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో తిరుగులేదు. పాటలు.. యాక్షన్ ఎపిసోడ్లకే భారీగా ఖర్చు పెట్టారు. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. కథ విషయంలో విజయేంద్ర ప్రసాద్ అంచనాల్ని అందుకోలేదు. స్క్రీన్ ప్లే విషయంలో మహదేవ్ మరింత డిజప్పాయింట్ చేశాడు. కన్నడ ప్రేక్షకులకు వేరే ఫీలింగ్ కలిగించొచ్చు కానీ.. తెలుగు ఆడియన్స్ కు మాత్రం ఇలాంటి కథాకథనాలు మొహం మొత్తేసి ఉన్నాయి.

చివరగా: జాగ్వార్.. పంజా దెబ్బకు తట్టుకోలేం

రేటింగ్: 2.25/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre