Begin typing your search above and press return to search.

75 కోట్ల సినిమా.. పట్టించుకుంటారా అసలు?

By:  Tupaki Desk   |   3 Oct 2016 10:30 PM GMT
75 కోట్ల సినిమా.. పట్టించుకుంటారా అసలు?
X
దసరా సినిమాల సందడికి సమయం దగ్గర పడింది. ఈ వారాంతంలోనే ఒకేసారి నాలుగు సినిమాలు రేసులోకి దిగేస్తున్నాయి. వీటిలో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు. ఒకటి ‘ప్రేమమ్’ అయితే.. ఇంకోటి ‘ఈడు గోల్డ్ ఎహే’. ఈ రెండూ కాకుండా తెలుగు-కన్నడ భాషల్లో ప్రకాష్ రాజ్ రూపొందించిన ‘మనవూరి రామాయణం’తో పాటు తెలుగు-తమిళం-హిందీ భాషల్లో తెరకెక్కిన ‘అభినేత్రి’ కూడా దసరాకే రాబోతోంది. ఈ నాలుగు సినిమాలూ ఒకే రోజు.. అక్టోబరు 7న విడుదలవుతాయి. వీటి కంటే ముందు రోజు కన్నడ కుర్రాడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’ రిలీజవుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన కొడుకు అరంగేట్రం కోసం ఏకంగా రూ.75 కోట్ల బడ్జెట్ పెట్టాడు ఈ సినిమాపై.

ఈ చిత్రాన్ని ముందు కన్నడలోనే రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ సలహా మేరకు తెలుగులోకి కూడా అనువదించారు. తెలుగు ప్రేక్షకుల టేస్టు తెలిసిన విజయేంద్ర ప్రసాద్ పట్టుబట్టి మరీ తెలుగులో రిలీజ్ చేయిస్తున్నాడంటే.. ఏం ప్రత్యేకత ఉందో ఏమో మరి. ఐతే దసరాకు విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాను మన ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహమే. నిఖిల్ కుమార్ విషయంలో మనవాళ్లకు ఏమంత ఆసక్తి లేదు. తమన్నా స్పెషల్ సాంగ్ చేసిందనో.. విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడనో ఈ సినిమాకు వెళ్లాలి. అది కూడా తొలి రోజు మాత్రమే ఈ సినిమా మన ప్రేక్షకుల్ని ఆకర్షించాలి. తర్వాతి రోజు నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి దీన్ని పట్టించుకునే వాడుండడు. అసలు ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో ‘జాగ్వార్’కు థియేటర్లు ఏమాత్రం దక్కుతాయన్నదీ సందేహమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/