Begin typing your search above and press return to search.

మారుతి అందుకొన్నాడండోయ్‌!

By:  Tupaki Desk   |   29 Oct 2015 11:12 AM GMT
మారుతి అందుకొన్నాడండోయ్‌!
X
మొన్ననే త‌న‌తో శ్రీమంతుడు సినిమా తీసినందుకుగానూ క‌థానాయ‌కుడు మ‌హేష్‌ బాబు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కి ఖ‌రీదైన ఆడి కారును అంద‌జేశారు. మ‌హేష్ నుంచి కార్ అందుకొన్న కొర‌టాల శివ‌ని చూసి చాలామంది ద‌ర్శ‌కులు స్ఫూర్తి పొందారు. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడు అలాంటి బ‌హుమాన‌మే అందుకొన్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు... భ‌లే భ‌లే ద‌ర్శ‌కుడు మారుతి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌లాంటి సినిమా తీసి హిట్టు కొట్టినందుకుగానూ అంద‌రితో ఇప్పుడు మారుతి భ‌లే భ‌లే ద‌ర్శ‌కుడు అనే పిలిపించుకొంటున్నాడు.

నాని క‌థానాయ‌కుడిగా మారుతి తెర‌కెక్కించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సూపర్ డూప‌ర్ హిట్ట‌యిన విష‌యం తెలిసిందే. అలాంటి ఓ మంచి సినిమాని ఇచ్చినందుకుగానూ నిర్మాత అల్లు అర‌వింద్ ఓ బెంజ్ కారును బ‌హుమానంగా ఇవ్వాల‌నుకొన్నాడు. అయితే ర‌క‌ర‌కాల కార‌ణాల‌వ‌ల్ల ఆ ప్ర‌య‌త్నం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రో నిర్మాత యువీ క్రియేష‌న్స్‌కి చెందిన వంశీ మారుతికి జాగ్వార్ కారును బ‌హుమానంగా ఇచ్చాడు. హైద‌రాబాద్‌ లోని ఓ షో రూమ్‌ లో ఆ కారును మారుతికి బ‌హుమానంగా అంద‌జేశారు.

మారుతి రేంజ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆయ‌న చిన్న చిత‌కా చిత్రాల్ని తీసే ద‌ర్శ‌కుడు కాదిప్పుడు. పెద్ద పెద్ద క‌థానాయ‌కులు సైతం మారుతితో సినిమా తీసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం వెంక‌టేష్‌ - నాగ‌చైత‌న్య‌లాంటి క‌థానాయ‌కుల్ని దృష్టిలో ఉంచుకొని మారుతి క‌థ‌ని సిద్ధం చేసుకొంటున్నాడు. త‌దుప‌రి చేయ‌బోయే సినిమా హిట్ట‌యితే మాత్రం మారుతి రేంజ్ మ‌రింత‌గా పెరుగుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.