Begin typing your search above and press return to search.

స‌ల్మాన్ తో స‌మ‌రానికి జ‌గ్గూభాయ్ రెడీ

By:  Tupaki Desk   |   1 May 2022 12:30 AM GMT
స‌ల్మాన్ తో స‌మ‌రానికి జ‌గ్గూభాయ్ రెడీ
X
తెలుగులో మ‌హిళా ప్రేక్ష‌కుల‌కు శోభ‌న్ బాబు త‌రువాత ఇష్ట‌మైన హీరోగా నిలిచిన జ‌గ‌ప‌తిబాబు 'లెజెండ్‌' మూవీతో ఒక్క‌సారిగా త‌న పంథా మార్చుకుని ప్ర‌తినాయ‌కుడిగా స‌రికొత్త అవ‌తారం ఎత్తారు. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను తెకెక్కించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'లెజెండ్‌' మూవీతో విల‌న్ పాత్ర‌ల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టారు. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో జ‌గ్గూ భాయ్ ఇక వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌ల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

తెలుగులో ఈ మ‌ధ్య నెగెటివ్ రోల్స్ త‌గ్గ‌డంతో జ‌గ్గూభాయ్ దృష్టి ఇప్ప‌డు బాలీవుడ్ వైపు మ‌ళ్లింది. క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ 'క‌బ్జా'లోనూ విల‌న్ గా న‌టిస్తున్న జ‌గ‌ప‌తిబాబు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా 'కేజీఎఫ్‌' వండ‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న 'స‌లార్‌'లోనూ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. ఇందులో జ‌గ‌ప‌తిబాబు రాజ‌మానార్ అనే అత్యంత క్రుయ‌ల్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నాడు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన జ‌గ్గూభాయ్ లుక్ సినిమాపై హైప్ ని క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గా జ‌గ‌ప‌తిబాబు తాజాగా బాలీవుడ్ లో క్రేజీ ఆఫ‌ర్ ని సొంతం చేసుకున్న‌ట్టుగా తెలిసింది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ఫ‌ర్హాద్ స‌మ్జీ తెర‌కెక్కిస్తున్నారు.

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. 'అంతిమ్‌' చిత్రం త‌రువాత స‌ల్మాన్ ఖాన్ 'క‌బీ ఈద్ క‌బీ దీవాలి' పేరుతో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే ప‌లు కార‌ణాల‌తో ఈ మూవీ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది.

సాజిద్ నదియా వాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ మూవీ మే 11న సెట్స్ పైకి రాబోతోంది. ఇందులో విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్నారంటూ ఇప్ప‌టికే వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని స‌ల్మాన్ ఖాన్ అధికారికంగా ప్ర‌క‌టించి షాకిచ్చారు. వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ మూవీలోనే జ‌గ్గూభాయ్ జ‌గ‌ప‌తిబాబు ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ 'రానా నాయుడు' కోసం ముంబైలో వున్న వెంక‌టేష్ మే 11న ప్రారంభం కానున్న స‌ల్మాన్ చిత్ర షూటింగ్ లో పాల్గొంటార‌ని తెలుస్తోంది. కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈమూవీని స‌ల్మాన్ ఖాన్ తో పాటు సాజిద్ న‌దియా వాలా నిర్మించ‌బోతున్నారు. ఇందులో జ‌గ‌ప‌తిబాబు - స‌ల్మాన్ ఖాన్ ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు హైలైట్ గా వుంటాయ‌ని, అలాగే కామెడీ టైమింగ్ వున్న పాత్ర‌ల్ని ర‌క్తిక‌ట్టించ‌డంతో దిట్ట‌లుగా పేరున్న స‌ల్మాన్ ఖాన్‌, వెంట‌కేష్ ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి.