Begin typing your search above and press return to search.
ఎప్పటికీ శ్రీదేవి నాతోనే ఉంటుంది:బోనీ కపూర్
By: Tupaki Desk | 3 Jun 2018 11:57 AM ISTఈ ఏడాది ఫిబ్రవరి 24న `అతిలోక సుందరి` - ప్రముఖ సినీ నటి శ్రీదేవి హఠాన్మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దుబాయ్ లో బంధువుల వివాహవేడుకకు హాజరైన శ్రీదేవి....అక్కడి జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయిన విషయం విదితమే. శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె భర్త బోనీకపూర్ - కూతుళ్లు జాన్వీ - ఖుషీలతో పాటు అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో జూన్ 2న తమ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బోనీకపూర్ బాధాతప్త హృదయంతో ఓ ట్వీట్ చేశారు. తన అర్ధాంగి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లినా....ఆమె తన జ్ఞాపకాల్లో ఎల్లపుడూ జీవించే ఉంటుందని ట్వీట్ చేశారు. గతంలో దివంగత శ్రీదేవి ఉపయోగించిన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా``శ్రీదేవీ బోనీ కపూర్ ``లో బోనీ కపూర్ ఈ ట్వీట్ చేయడం విశేషం. ఆ ట్వీట్ తో పాటు దుబాయ్ లో జరిగిన వివాహ వేడుకలో ఆఖరిసారి శ్రీదేవి చేసిన సందడి దృశ్యాల వీడియోను కూడా బోనీ కపూర్ పోస్ట్ చేశారు.
