Begin typing your search above and press return to search.

బిగ్ న్యూస్: శంకర్ దర్శకత్వంలో రణవీర్ 'అపరిచితుడు'..!

By:  Tupaki Desk   |   14 April 2021 12:00 PM IST
బిగ్ న్యూస్: శంకర్ దర్శకత్వంలో రణవీర్ అపరిచితుడు..!
X
దక్షిణాది అగ్ర దర్శకుడు శంకర్ కెరీర్ లో ''అపరిచితుడు'' (అన్నియన్) సినిమా ప్రత్యేకమని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరిగిపోతున్న అవినీతి సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది.. దానికి పరిష్కారం ఏంటనే ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. స్ప్లిట్ పర్సనాలిటీని లీడ్ గా తీసుకుని డైరెక్టర్ శంకర్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ఈ సినిమా సూపర్ హిట్ ‏గా నిలవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో హీరో విక్రమ్ అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ''అపరిచితుడు'' సినిమా వచ్చిన 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది.

శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ ‏వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ''అపరిచితుడు'' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జయంతి లాల్ గడ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గాడ్ బ్లెస్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు కో ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు. 2022 ద్వితీయార్థంలో ఈ పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని మేకర్స్ తెలిపారు. అయితే 'అపరిచితుడు' సినిమా సౌత్ లోనే కాదు హిందీలో కూడా డబ్ కాబడి నార్త్ ఆడియన్స్ ని కూడా అలరించింది. మరి ఇన్నేళ్ళ తర్వాత దీనిని బాలీవుడ్ లో రీమేక్ చేయటానికి శంకర్ - రణవీర్ సింగ్ సంకల్పించడం ఆసక్తి కలిగించే అంశం.

అయితే అవినీతి అనేది సమాజంలో ఎప్పటికీ ఉండే అభివృద్ధి ఆటంకమే కాబట్టి శంకర్ నేటి పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఇకపోతే అవినీతిపరులను శిక్షించే స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిగా విక్రమ్ అద్భుతంగా నటించి సినిమా సక్సెస్ కి ఒక కారణమయ్యాడు. మరి ఇప్పుడు ఈ రీమేక్ పై మోజుపడ్డ రణవీర్ ఇందులో ఎలా నటిస్తాడో చూడాలి. కాగా, శంకర్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత రణ్‌ వీర్ తో 'అపరిచితుడు' సెట్స్ పైకి వెళ్తుంది. 16 ఏళ్ళైనా ఏమాత్రం క్రేజ్ తగ్గని ఈ సినిమా హిందీలో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.