Begin typing your search above and press return to search.

అది వాక్ స్వాతంత్య్రానికి విరుద్ధం.. సినీ ద‌ర్శ‌కుడు మురుగ‌దాసు కేసులో కోర్టు

By:  Tupaki Desk   |   28 July 2021 5:18 PM IST
అది వాక్ స్వాతంత్య్రానికి విరుద్ధం.. సినీ ద‌ర్శ‌కుడు మురుగ‌దాసు కేసులో కోర్టు
X
కోలీవుడ్‌ క్రియేటివ్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ - అగ్ర‌హీరో విజ‌య్ కాంబినేష‌న్లో వ‌చ్చిన మూవీ 'స‌ర్కార్'. 2018లో విడుదలైన ఈ చిత్రం.. పొలిటిక‌ల్ సెటైర్ గా సంచ‌ల‌నం రేకెత్తించింది. ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించిందీ చిత్రం. దీంతో.. త‌మిళ‌నాట అల‌జ‌డి సృష్టించింది. త‌మిళ పార్టీలు, ప్ర‌భుత్వ‌లు ఏ స్థాయిలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తాయో అంద‌రికీ తెలిసిందే. ఈ ప‌ద్ధ‌తినే విమ‌ర్శించ‌డంతో నాటి అధికార పార్టీ నేత‌లు భుజాలు త‌డుముకున్నారు.

దీంతో.. ఈ చిత్రానికి వ్య‌తిరేకంగా అన్నాడీఎంకే నేత‌లు పోలీసుల‌కు సైతం ఫిర్యాదు చేశారు. దేవ‌రాజ్ అనే ఏఐడీఎంకే కార్య‌క‌ర్త‌.. చెన్నై సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ ను ఆశ్ర‌యించాడు. దీంతో.. పోలీసులు స‌ర్కారు చిత్ర ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ పై కేసు న‌మోదు చేశారు. అప్ప‌టి నుంచి ఈ కేసు కొన‌సాగుతూనే ఉంది. ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు.

అనంత‌రం.. త‌న‌పై న‌మోదు చేసిన కేసు అన్యాయ‌మైంద‌ని, దాన్ని కొట్టేయాల‌ని మ‌రో పిటిష‌న్ సైతం దాఖ‌లు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచార‌ణ సోమ‌వారం మ‌ద్రాసు హైకోర్టులో జ‌రిగింది. వాదోప‌వాదాలు విన్న త‌ర్వాత న్యాయ‌స్థానం త‌న తీర్పు వెలువ‌రించింది. సినిమా అనేది సెన్సార్ పూర్తి చేసుకున్న త‌ర్వాత‌నే విడుద‌లైంద‌ని, సెన్సార్ పూర్త‌యిన త‌ర్వాత ఒక వ్య‌క్తిగానీ, ప్ర‌భుత్వం గానీ ఆ చిత్రానికి వ్య‌తిరేకంగా కేసు పెట్ట‌లేరని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఈ పిటిష‌న్ భార‌త రాజ్యాంగం అందించిన వాక్ వాక్ స్వాతంత్య్రానికి విరుద్ధమ‌ని తేల్చి చెప్పింది. అందువ‌ల్ల ఈ పిటిష‌న్ కొట్టేస్తున్న‌ట్టు తీర్పు చెప్పింది మ‌ద్రాసు హైకోర్టు.