Begin typing your search above and press return to search.

ఆగస్ట్‌ 22.. సెప్టెంబర్‌ 22 రెండు నాకు ప్రత్యేకమే

By:  Tupaki Desk   |   22 Sept 2020 4:00 PM IST
ఆగస్ట్‌ 22.. సెప్టెంబర్‌ 22 రెండు నాకు ప్రత్యేకమే
X
మెగాస్టార్‌ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుండి కూడా చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకానొక సమయంలో ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా పేరు దక్కించుకున్నారు. అలాగే ఇండియాలో మొదటి కోటి పారితోషికం తీసుకున్నది కూడా మెగాస్టార్‌ చిరంజీవి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ ఉంది. అంతటి స్టార్‌ డంను దక్కించుకున్న చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదల అయ్యి 42 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. ఆగస్టు 22 నేను ప్రాణం పోసుకున్న రోజు అయితే సెప్టెంబర్‌ 22న నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు అంటూ పేర్కొన్నారు.

ట్విట్టర్‌ లో చిరంజీవి.. నా జీవితంలో ఆగస్టు 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో సెప్టెంబర్‌ 22కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగస్టు 22న నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజు అయితే సెప్టెంబర్‌ 22న నటుడిగా 'ప్రాణం' (ఖరీదు) పోసుకున్న రోజు. నా తొలి సినిమా విడుదల అయిన రోజు. నన్ను ఇంతగా ఆధరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికి ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణం అయిన నా అభిమానులందరికి కూడా ఈ సందర్బంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. నవంబర్‌ లో సినిమా షూటింగ్‌ పునః ప్రారంభించే అవకాశం ఉంది. ఆచార్యలో కీలక పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నాడు. చిరంజీవికి జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించబోతుంది. ఇప్పటికే వీరిద్దరు ఖైదీ నెం.150 సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి నటించేందుకు సిద్దం అయ్యారు.