Begin typing your search above and press return to search.

ఈ మిషన్ ఇస్రో సాయంతోనే..!

By:  Tupaki Desk   |   31 July 2019 11:59 AM GMT
ఈ మిషన్ ఇస్రో సాయంతోనే..!
X
`మిష‌న్ మార్ష్` ఆప‌రేష‌న్ లో పాల్గొన్న కొంద‌రు మ‌హిళా శ‌క్తుల్ని హైలైట్ చేస్తూ తెర‌కెక్కించిన సినిమా `మిష‌న్ మంగ‌ళ్‌`. అక్ష‌య్ కుమార్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. విద్యా బాల‌న్ - తాప్సీ- సోనాక్షి సిన్హా- నిత్యా మీన‌న్ - కీర్తి కుల్హ‌రి సైంటిస్టులుగా క‌నిపించ‌నున్నారు. జగన్‌ శక్తి దర్శక‌త్వం వ‌హించారు. ఫాక్స్ స్టార్ తో క‌లిసి హోప్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్స్ పైకి తొలి స్పేస్ షిప్‌ ప్ర‌యోగం(2014)లో మ‌హిళా సైంటిస్టుల‌ పాత్ర ఎలాంటిది? ఈ ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టిన సాహ‌సికుని క‌థ‌ను తెర‌పై చూపిస్తున్నారు. ఆగ‌స్టు 15న ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌చారంలో వేగం పెంచింది టీమ్. ఆగ‌స్టు 8న మెల్ బోర్న్ లో జ‌ర‌గ‌నున్న ఇండియ‌న్ ఫిలింఫెస్టివ‌ల్ ఆఫ్ మెల్ బోర్న్-2019 వేడుక‌ల్లోనూ ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

తాజాగా ముంబైలో జ‌రిగిన ఓ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని గ‌మ్మ‌త్త‌యిన విష‌యాల్ని కిలాడీ అక్ష‌య్ కుమార్ రివీల్ చేశారు. ఈ సినిమాని తెర‌కెక్కించేందుకు ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో)ని సంప్ర‌దించార‌ట‌. ఇస్రో సైంటిస్టుల నుంచి మెటీరియ‌ల్ ప‌రంగా సాయం అందింద‌ట‌. ఇక వీఎఫ్ ఎక్స్ టీమ్ కి అవ‌స‌రం మేర స‌లహాల్ని ఇస్రో నుంచి తీసుకున్నారు. ఇక డ‌మ్మీ రాకెట్ డిజైన్ స‌హా త‌యారీలోనూ సాయం ల‌భించింది. అయితే ఇస్రో బెంగ‌ళూరు సెంట‌ర్ లో మాత్రం షూటింగ్ కి అనుమ‌తించ‌లేద‌ని.. ర‌క్ష‌ణ ప‌ర‌మైన అడ్డంకుల వ‌ల్ల ఇబ్బంది త‌లెత్తింద‌ని వెల్ల‌డించారు. ద‌ర్శ‌కుడు జ‌గ‌న్ శ‌క్తి సోద‌రి సుజాత ఇస్రోలో ప‌ని చేయ‌డంతో త‌న ద్వారా చాలా విష‌యాలు తెలిశాయ‌ని తెలిపారు. అప్ప‌ట్లో మిష‌న్ మంగ‌ళ్యాన్ ఆప‌రేష‌న్ కోసం ఉప‌యోగించిన రాకెట్ లాంటిదే య‌థాత‌థంగా త‌యారు చేయ‌లేదు. ఇంచుమించు పోలిక‌లు ఉండే విధంగా జాగ్ర‌త్త ప‌డ్డార‌ట‌.

వాస్త‌వానికి ఇదే కాన్సెప్ట్ తో 2017లో ఏక్తా క‌పూర్ ఓ చిత్రాన్ని నిర్మించాల‌ని అనుకున్నా అప్ప‌ట్లో కుద‌ర‌లేదు. ఇస్రో నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర‌వ్వ‌డంతో వెనకాడార‌ట‌. ఒకే బ‌స్ లో కూర‌గాయ‌లు కొనేందుకు వెళ్లే కొంద‌రు ఆర్డిన‌రీ ఆడా మ‌గా క‌లిసి చేసిన అసాధార‌ణ ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా అని అక్ష‌య్ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు. దీనిని ఒక వ్య‌క్తి బ‌యోపిక్ లా తెర‌కెక్కించ‌లేదు. ఎందుకంటే ఆ మిష‌న్ కొంద‌రి క‌ల‌యిక వ‌ల్ల సాధ్య‌మైంద‌ని తెలిపారు. ఈ సినిమాకి హాలీవుడ్ చిత్రం హిడెన్ ఫిగ‌ర్స్ (2016) స్ఫూర్తి ఉందా? అంటే రెండిటికీ మ‌ధ్య పోలిక‌లు ఉండ‌వ‌ని తెలిపారు. హిడెన్ ఫిగ‌ర్స్ చిత్రం 1960లో నాసా ప్ర‌యోగానికి సంబంధించిన సైన్స్ ఫిక్ష‌న్ డ్రామా. కానీ తాజా చిత్రం 2014లో మంగ‌ళ్యాన్ ప్ర‌యోగానికి సంబంధించినది అని వెల్ల‌డించారు. ఆ సినిమా రేసిజమ్ పై తీసిన‌ది. ఈ సినిమా ఓ మిష‌న్ కోసం శ్ర‌మించే ముగ్గురు చీర‌క‌ట్టు ఆడాళ్ల క‌థ‌తో తెర‌కెక్కించిన‌ది అని తెలిపారు.