Begin typing your search above and press return to search.

'ఇష్క్' ట్రైలర్: ఇది ప్రేమ కథ మాత్రమే కాదు..!

By:  Tupaki Desk   |   15 April 2021 5:16 AM GMT
ఇష్క్ ట్రైలర్: ఇది ప్రేమ కథ మాత్రమే కాదు..!
X
యువ కథానాయకుడు తేజ సజ్జా - ప్రియా ప్రకాష్‌ వారియర్‌ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''ఇష్క్''. 'నాట్‌ ఎ లవ్‌స్టోరీ' అనేది దీనికి ఉపశీర్షిక. యస్‌.యస్‌.రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సౌత్ ఇండియాలోని బడా బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ కొంత విరామం త‌ర్వాత తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌ - పార‌స్ జైన్‌ - వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌ - సాంగ్స్‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఇష్క్' ట్రైలర్ ను సుప్రీమ్ హీరో సాయి తేజ్ రిలీజ్ చేశారు.

'ఇష్క్' ట్రైలర్ హీరోహీరోయిన్ల మధ్య మనోహరమైన ప్రేమకథను చెప్పే ఆహ్లాదకరమైన చిత్రమని చెప్పే విధంగా ప్రారంభమవుతుంది. హీరోయిన్ బర్త్ డే ప్లాన్స్ చేసుకున్న హీరో.. ఆమెతో కలిసి కారులో బయలు దేరడం.. ఒక ముద్దిస్తావా అని అడగడం వంటివి రొమాంటిక్ ఫీల్ ని కలిగించాయి. అయితే ఒక్క ఇన్సిడెంట్ తో అన్ని విషయాలు తలక్రిందులైనట్లుగా.. సడన్ గా హీరోని ఎవరో తరుముతున్నట్లుగా చూపించారు. తేజాను వెంబడిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? దీనికి అసలు కారణమేమిటి? అతన్ని ఎలా కనుగొంటాడు? ఈ క్రమంలో హీరోకి ఎదురయ్యే సమస్యలేమిటి? అనేది ఈ కథలో చూపించబోతున్నట్లు అర్థం అవుతోంది. మొత్తం మీద ట్యాగ్‌ లైన్ సూచించినట్లు ఇది ప్రేమ కథ మాత్రమే కాదని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

తేజా - ప్రియా ప్రకాష్ వారియర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలానే వీరిద్దరూ తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సరిపోయారనిపిస్తుంది. ఈ ట్రైలర్ కు మహతి స్వరసాగర్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు శ్యామ్ కె. నాయుడు కెమెరా పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా సాగిన 'ఇష్క్' ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి వ‌ర‌ప్ర‌సాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌ గా పని చేస్తున్నారు. ఇటీవ‌ల 'జాంబీ రెడ్డి' మూవీతో సక్సెస్ అందుకున్న తేజ స‌జ్జా.. ''ఇష్క్‌'' సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.