Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ హీరోల‌కు OTT ప్లాన్ లేదా?

By:  Tupaki Desk   |   17 Dec 2019 4:16 AM GMT
టాలీవుడ్ స్టార్ హీరోల‌కు OTT ప్లాన్ లేదా?
X
డిజిట‌ల్ విప్ల‌వం స‌రికొత్త అవ‌కాశాల‌కు తెర‌తీసిన‌ ఈ ట్రెండ్ లో ఫ్యామిలీ హీరోల‌కు అది పెద్ద ప్ల‌స్ కానుందా? అంటే అవున‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. కుటుంబ హీరోలంతా ఓటీటీ వేదిక‌ను ఆశ్ర‌యించి రెవెన్యూ జ‌న‌రేట్ చేసే సౌల‌భ్యం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా వినిపిస్తున్న మాట ఓటీటీ వేదిక‌. సినిమాకు స‌మాంత‌రంగా డిజిట‌ల్ దునియా దేశ వ్యాప్తంగా వేళ్లూనుకుంటోంది. స్మార్ట్ ఫోన్‌ వినియోగం .. వీడియో స్ట్రీమింగ్ కంపెనీల రాక‌తో అంతా మారిపోయింది. మొబైల్ లోనే స‌ర్వ‌స్వం. అక్క‌డ‌ పూర్తి వినోదాన్ని అందించేందుకు డిజిట‌ల్ ప్లాట్ ఫామ్స్ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికాకు చెందిన‌ నెట్‌ఫ్లిక్స్‌.. అమెజాన్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇప్ప‌టికే ఇండియా డిజిట‌ల్ మార్కెట్ ని ఆక్ర‌మించేశాయి. మ‌రి కొన్ని బ‌హుళ‌జాతి సంస్థ‌లు భారీ పెట్టుబ‌డుల‌తో ఈ మార్కెట్ లోకి ప్ర‌వేశించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

త్వ‌ర‌లో భార‌తీయ డిజిట‌ల్ మార్కెట్లోకి ప్ర‌ఖ్యాత డిస్నీ సంస్థ‌తో పాటు ఆపిల్ కూడా ప్ర‌వేశిస్తోంది. ఇందు కోసం ఇప్ప‌టికే ఏర్పాట్ల‌ను పూర్తి చేసుకున్నాయి. ఈ త‌రుణంలో టాలీవుడ్ బ‌డా నిర్మాత‌లు ప్ర‌త్యేకంగా త‌మ సినిమాలు.. వెబ్ సిరీస్ ల‌ కోస‌మే ఓ డిజిటిల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇందులో టాలీవుడ్ అగ్ర నిర్మాత‌.. గీతా ఆర్ట్స్ అధినేత‌ అల్లు అర‌వింద్ తొలి అడుగు వేశారు. త‌న‌యుడు అల్లు శిరీష్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గా ఈ ఓటీటీ వేదిక ర‌న్ కానుంది. ఇప్ప‌టికే డిజిట‌ల్ వేదిక‌కు అవ‌స‌రం అయిన సాఫ్ట్ వేర్ అభివృద్ధి- బ్యాకెండ్ సిస్ట‌మ్ ని రెడీ చేస్తున్నారు.

అయితే ఇది కేవ‌లం బాస్ అర‌వింద్ వ‌ర‌కే ప‌రిమిత‌మా? అంటే... ఈ కోణంలో టాలీవుడ్ కి చెందిన దిగ్గ‌జాలు ఆలోచించే అవ‌కాశం లేక‌పోలేద‌న్న మాటా వినిపిస్తోంది. ప్ర‌తి బ‌డా నిర్మాణ సంస్థ‌కు సొంత హీరోలు ఉన్నారు. న‌వ‌త‌రం ట్యాలెంటును ఎంక‌రేజ్ చేస్తూ పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస్కారం ఉంది. ఇక ఇప్పుడు డిజిట‌ల్ పుణ్య‌మా అని ఓటీటీ వేదిక అంద‌రికీ అందుబాటులో ఉంది. అగ్ర నిర్మాత‌ల్లో డి. సురేష్‌బాబు- దిల్ రాజు- డివివి దాన‌య్య వంటి దిగ్గ‌జ నిర్మాత‌లు ఈ దిశ‌గా ఆలోచిస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. అయితే ఇందులో స్టార్ హీరోల ప్ర‌మేయం లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. బాలీవుడ్ లో మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సొంత ఓటీటీ వేదిక‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. అలాగే సైఫ్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు అక్క‌డ కార్పొరెట్ టై అప్ తో ఓటీటీ వేదిక‌పై న‌టిస్తున్నారు.

అయితే ఈ త‌ర‌హా ప్ర‌య‌త్నం టాలీవుడ్ లో క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. మెగా ఫ్యామిలీలో హీరోల లిస్ట్ పెద్ద‌దే. ఇప్ప‌టికే డ‌జ‌ను మంది మెగా వృక్షం నీడ‌లో హీరోలుగా ఎదుగుతున్నారు. సినిమాల‌తో పాటు ఓటీటీ వేదిక‌ల‌పైనా న‌టించేందుకు స్కోప్ ఉన్నా.. ఆ కాంపౌండ్ నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ కు సంబంధించిన ఏ క‌ద‌లికా క‌నిపించ‌డం లేదు. అక్కినేని...ఘ‌ట్ట‌మ‌నేని... మంచు కాంపౌండ్ హీరోల్లో కూడా ఇలాంటి ఆలోచ‌న చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. వీరంతా ఓటీటీ పై ఆస‌క్తిగా లేరా? లేదా ఆ అవ‌స‌రం మ‌న‌కు రాదు అని అనాస‌క్తిగా ఉన్నారా?

కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీని స్థాపించిన రామ్ చ‌ర‌ణ్ మునుముందు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుల్ని ఈ బ్యాన‌ర్ లో ప్ర‌మోట్ చేయ‌నున్నార‌న్న ప్ర‌చారం ఉంది. అయితే కొణిదెల బ్రాండ్ ఓటీటీ వేదిక‌ను సిద్ధం చేస్తే అది మ‌రింత సులువు అవుతుంది క‌దా! అన్న‌దానిపై అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అయితే భ‌విష్య‌త్ ప్ర‌తిదీ నిర్ణ‌యిస్తుంది. మునుముందు స్టార్ హీరోలు సొంత ఓటీటీ వేదిక‌ల‌కు సిద్ధ‌మైనా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. కార్పొరెట్ కంపెనీల భాగ‌స్వామ్యంతో ఇది సాధ్య‌మేన‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది.