Begin typing your search above and press return to search.

ప్రభాస్ షూటింగ్ ప్లాన్ ఇదేనా..?

By:  Tupaki Desk   |   15 Jun 2021 9:00 AM IST
ప్రభాస్ షూటింగ్ ప్లాన్ ఇదేనా..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో దూకుడుమీదున్నాడు. రాధాకృష్ణ కుమార్ తో ‘రాధే శ్యామ్’.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’.. ఓమ్ రౌత్ డైరెక్షన్‌ లో ‘ఆదిపురుష్’ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో వీటి చిత్రీకరణ పూర్తి చేయనున్నాడు ప్రభాస్.

పీరియాడికల్ లవ్ స్టొరీ 'రాధే శ్యామ్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. జూన్ చివరి వారంలో తిరిగి షూట్ లో పాల్గొనాలని చూస్తున్న ప్రభాస్.. ముందుగా ఈ పెండింగ్ వర్క్ ని కంప్లీట్ చేయనున్నాడు. దీని తర్వాత 'సలార్' 'ఆదిపురుష్' చిత్రాలు ప్యారలల్ గా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే మైథలాజికల్ చిత్రం ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి.. 'సలార్' సినిమాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వనున్నారు.

'సలార్' చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో మరో ముప్పై కాల్షీట్స్ తో పూర్తి చేసే విధంగా ప్రణాళిక రచించారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే 'కేజీఎఫ్' దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమా అంత తక్కువ రోజుల్లో షూట్ చేయడం కష్టమే. భారీ క్యాస్టింగ్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కనుక దానికి తగ్గట్టుగా షూటింగ్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.

అలానే 2022 ఆగస్టులో రావాలని చూస్తున్న 'ఆదిపురుష్' ఇప్పటికే 60 రోజులు చిత్రీకరణ జరుపుకుంది. మరో 90 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఎక్కువ భాగం సీన్స్ గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగ్ అశ్విన్ సినిమా ఉన్నప్పటికీ.. దానికి బల్క్ డేట్స్ అవసరముంది. అందుకే ఈ రెండు సినిమాలు పూర్తి చేసి గాని పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయరు. అందుకే అది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమవుతుందని అంటున్నారు.

అయితే ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ అప్పుడే మరో సినిమాకి కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది దిల్ రాజు బ్యానర్ లో రాబోయే మైథలాజికల్ మూవీ అని అంటున్నారు. ‘బాహుబలి’ ని మించిపోయే రేంజ్ లో తెరకెక్కబోతోందనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా చెయ్యాలంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తవ్వాలి. ఏదేమైనా క‌రోనా పాండమిక్ కార‌ణంగా ప్ర‌భాస్ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో.. ఎప్పుడు విడుదల అవుతాయో చెప్పలేని పరిస్థితి వచ్చిందనేది మాత్రం వాస్తవం.