Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా?

By:  Tupaki Desk   |   5 Dec 2019 6:14 AM GMT
ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా?
X
కులం అనేదే లేదు. మనుషులందరూ సమానమే. నా పేరు వెనక తోక లేదు చూడండి. నేను అభ్యుదయవాదిని..ఇలా చాలామంది చెప్తూ పైకి కాకమ్మ కథలు చెప్తూనే ఉంటారు. ఇవి నమ్మినవాడికి బొత్తిగా బుర్ర లేదనే అర్థం. ఇటు సాధారణ ప్రజలు అయినా.. అటు సెలబ్రిటీలు అయినా అధికశాతం క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నవారే. ఒకవేళ నిజంగా ఎవరైనా కులం ప్రస్తావన తీసుకురాకుండా ఉంటే.. వాడిని కూడా ఈ జనాలు వదలకుండా ఈ రొచ్చులోకి లాగుతారు. అంతెందుకు.. అందరూ సమానం అని చెప్పే ప్రభుత్వం కూడా అన్ని చోట్ల.. అన్ని అప్లికేషన్స్ లో "క్యాస్ట్ ఏంటి?" అనే ప్రశ్నను వేస్తూ ఉంటుంది. ఇంతకంటే తికమక మకతిక వ్యవహారం ఎక్కడా మనం చూడలేం. ఇదంతా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగే వ్యవహారం. మరి దేశమంతా ప్రతి ఒక్కరి నరనరాన జీర్ణించుకుపోయిన ఈ క్యాస్ట్ ఫీలింగ్ టాలీవుడ్ లో ఉందా?

ఒక్క ముక్కలో జవాబు చెప్పాలంటే 'ఉంది'. లేకేం.. భేషుగ్గా ఉంది. గతంలో అది పైకి కనిపించేది కాదు. ఏదో గుట్టుచప్పుడు కాకుండా కులం వ్యవహారాలు జరిగేవి. ఒక కులం వారిని చేరదీయడాలు.. తమ కులంవారికి లిఫ్ట్ ఇచ్చుకోవడాలు చాలానే ఉండేవి కానీ బయటకు కనిపించేది కాదు. అయితే ఈమధ్య ఈ కుల జాడ్యం కాస్త ఎక్కువైందని అది పైకి కూడా కనిపిస్తోందని ఇండస్ట్రీలో ఈ గ్రూపులతో సన్నిహితంగా మెలిగేవారు వ్యాఖానిస్తున్నారు. గతంలో తమ కులం వారికి మేలు చేకూర్చడం లాంటివి ఉన్నాప్పటికీ మిగతావారికి కూడా ఎంతో గౌరవంగా వ్యవహరించేవారని.. ఇతరులతో పని చేసేందుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండేవి కావని.. ఇప్పుడు గ్రూప్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయిందని అంటున్నారు. ఒక క్యాస్ట్ కు సంబంధించిన వారందరూ ఒక జట్టుగా మారిపోతున్నారని.. మరో క్యాస్ట్ వారు మరో జట్టుగా ఇలాం గ్రూపిజం ఎక్కువందని అంటునారు. కొందరైతే కులం బేస్ మీదే తమ స్నేహాలను ఎంచుకుంటున్నారనే టాక్ ఉంది. తమ కులానికి సంబంధించిన వారితో మాత్రమే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నారట.

కొందరైతే తమ ఇండస్ట్రీపై తమ కులానికే ఆధిపత్యం ఉండాలనే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. హీరోలు.. నిర్మాతల నుంచి మొదలుకొని సినీరంగంలోని ఇతర శాఖల వారి వరకూ ఈ జాడ్యం పట్టి పీడిస్తోందని అంటున్నారు. అయితే ఇలా నరనరాన కులాభిమానం నింపుకున్న వీరే పైకి మాత్రం శుద్ధపూసల తరహాలో వ్యవహరిస్తూ సాధారణ ప్రజల దగ్గరకు వచ్చే సరికి కులం అనే పదం తెలియని వ్యక్తుల లాగా కవరింగ్ ఇస్తున్నారట. సాధారణ ప్రేక్షకులకు ఈ విషయం గురించి తెలిసే అవకాశాలు తక్కువ కానీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఇదంతా తెలిసిన విషయమే.. ఇందులో అవాక్కవ్వాల్సిన పనేలేదు అంటున్నారు. ఇదంతా చూస్తున్న కొందరు సీనియర్లు ఇండస్ట్రీ ఎటు వైపు వెళ్తోందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు