Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా ఉందా...?

By:  Tupaki Desk   |   5 Sept 2020 5:40 PM IST
టాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా ఉందా...?
X
సినీ ఇండస్ట్రీని ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా ఉందనేది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణే అయినప్పటికీ సుశాంత్ కేసులో వెలుగుచూస్తున్న డ్రగ్స్ వ్యవహారం కారణంగా మరోసారి హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ డర్టీ సీక్రెట్స్ అంటూ పెట్టిన ట్వీట్స్ డ్రగ్స్ మాఫియాపై చర్చకు దారితీసాయి. బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్ - రణవీర్ సింగ్ - విక్కీ కౌశల్ వంటి వారు డ్రగ్స్ తీసుకోలేదని ప్రకటించాలని కంగనా డిమాండ్ చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. అంతేకాకుండా బాలీవుడ్ లో దాదాపు 99 శాతం మంది డ్రగ్స్ ని నీళ్లలాగే తీసుకుంటారని.. తనతో ఒకప్పుడు ఎఫైర్ సాగించిన ఓ బాలీవుడ్ స్టార్ హీరోకి డ్రగ్స్ అలవాటు ఉందని.. అందుకే అతను నన్ను జైలులో పెట్టించాలని చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు బాలీవుడ్‌ డ్రగ్స్ వ్యవహారం నుంచి శాండల్‌ వుడ్‌ కు చేరింది. మాదకద్రవ్యాల మాఫియాతో 20మంది కన్నడ నటీనటులకు లింకులున్నాయని బెంగళూరు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే పలువురు నటీమణుల ఇళ్లపై దాడులు చేయడమే కాకుండా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టాలీవుడ్ లో కూడా డ్రగ్స్ మాఫియా ఉందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.

కాగా, 2017లో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎక్సైజ్ చీఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన విచారణలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పూరీ జగన్నాథ్ - రవితేజ - ఛార్మీ - సుబ్బరాజు - నవదీప్ - తరుణ్ - మొమైత్ ఖాన్ తదితరులు విచారణకు హాజరయ్యారు. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం నిత్యం వార్తల్లో ఉండేది. అయితే ఉన్నట్టుండి ఈ కేసు ఏమైందో తెలియకుండా పోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియా పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కూడా వార్తల్లోకి వచ్చింది. ఇటీవల సినీ నటి మాధవీలత టాలీవుడ్‌ లో సైతం డ్రగ్స్ వాడకం ఎక్కువ ఉందని.. డ్రగ్స్ లేకుండా పార్టీలు జరుగవని సంచలన ఆరోపణలు చేస్తూ టాలీవుడ్‌ పై తెలంగాణ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులు దృష్టి పెట్టాలని కోరింది. దీంతో టాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా నడుస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'తుపాకీ డాట్ కామ్' లో 'టాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా ఉందని భావిస్తున్నారా?' అని పెట్టిన పోల్ లో సుమారు 89 శాతం మంది ఉందని అభిప్రాయపడగా 6 శాతం లేదని.. 4 శాతం మంది చెప్పలేమని చెప్పారు. దీనిని బట్టి చూస్తే ఎక్కువమంది టాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా ఉందని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.