Begin typing your search above and press return to search.

విదేశాల్లో అయితేనే సేఫ్ అని RRR టీమ్ ఫిక్స‌యిందా?

By:  Tupaki Desk   |   5 July 2021 7:42 AM GMT
విదేశాల్లో అయితేనే సేఫ్ అని RRR టీమ్ ఫిక్స‌యిందా?
X
క‌రోనా సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో RRR యూనిట్ తిరిగి షూటింగ్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా బ్యాలెన్స్ టాకీ పార్ట్ కూడా పూర్తిచేసిన‌ట్లు ఇటీవ‌లే టీమ్ ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో త‌దుపరి పాట‌ల చిత్రీక‌ర‌ణ మొద‌లవుతుంద‌ని యూనిట్ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో విజువ‌ల్ గ్రాండియ‌ర్ గా పాట‌ల చిత్రీక‌ర‌ణకు భారీ కాన్వాసుపై స‌న్నాహాకాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాజ‌మౌళి అండ్ టీమ్ షూటింగ్ ప‌నుల్లోనే బిజీగా ఉన్నారు. పాట‌ల‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో చిత్ర‌బృందం నిమ‌గ్న‌మయ్యారు. రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఉక్రెయిన్ లో ఉన్నారు. అక్క‌డ అంద‌మైన లోకేష‌న్ల వేట‌లో ప‌డ్డారు.

గ‌త వారం రోజులుగా రాజ‌మౌళి అదే ప‌నిలో బిజీగా ఉన్న‌ట్లు తాజా స‌మాచారం. లోకేష‌న్స్ అన్నింటిని ఎంపిక చేసిన త‌ర్వాత మిగ‌తా బృందం ఉక్రెయిన్ ప్లైట్ ఎక్క‌నున్నారు. ప్ర‌త్యేకంగా ఉక్రెయిన్ లో ఎన్టీఆర్-ఒలివియా మోరిష్ పై ప్ర‌త్యేక గీతాలు చిత్రీక‌రించ‌నున్నారు. ఇంకా టాకీ పార్ట్ కు సంబంధించి ఆ లోకేష‌న్స్ లో షూట్ చేయాల్సిన స‌న్నివేశాలేమైనా ఉంటే చిత్రీక‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్ షూట్ పూర్తి చేసుకున్న అనంత‌రం యూనిట్ నేరుగా హైద‌రాబాద్ వ‌స్తుంది. ఇక్క‌డ దాదాపు నెల రోజుల పాటు మిగ‌తా పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో మాత్రం రామ్ చ‌ర‌ణ్‌- అలియా భ‌ట్ పై షూట్ చేయాల్సిన పాట‌లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని యూనిట్ తెలిపింది. అలాగే మిగ‌తా న‌టీన‌టులు..టైటిల్ ట్రాక్స్ ఏమైనా ఉంటే హైద‌రాబాద్ లో చిత్రీక‌రించేలా రాజ‌మౌళి సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం ఇక్క‌డి ప్ర‌భుత్వాలు కొవిడ్ థ‌ర్డ్ వేవ్ ని ఎదుర్కొనేందుకు సిద్ద‌మ‌వుతోన్నాయి. బ‌య‌ట దేశాల్లో ఇంకా థ‌ర్డ్ వేవ్ ప‌తాక స్థాయిలోనూ లేదు. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి ఉక్రెయిన్ షూటింగ్ ను హ్యాపీగా పూర్తి చేయోచ్చ‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో డి.వి.వి దాన‌య్య నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ అనేది దేశాల స్థితిగ‌తుల్ని నిర్ధేశిస్తోంది. భార‌త‌దేశంతో పోలిస్తే అమెరికా - ర‌ష్యా లాంటి అగ్ర రాజ్యాలు శ‌ర‌వేగంగా ప్ర‌జ‌ల‌కు వ్యాక్సినేష‌న్ ని పూర్తి చేస్తున్నాయి. దీంతో అక్క‌డ షూటింగులు సుర‌క్షితం అని సినిమావాళ్లు భావిస్తున్నారు. భార‌త‌దేశంలో 20 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ పూర్త‌యినా ఇంకా 130 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ చేయించాల‌న్నదే పెద్ద బెంగ‌. అందుకే ఇటీవ‌ల విదేశీ షెడ్యూల్స్ పైనా చిత్ర‌బృందాలు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నాయి.