Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ యూనిట్ ఇలా చేస్తోందా? డామిట్..

By:  Tupaki Desk   |   1 Jan 2021 4:30 PM GMT
కేజీఎఫ్ యూనిట్ ఇలా చేస్తోందా? డామిట్..
X
హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం.. కానీ, సినిమాకు అభిమానులు ఉండడం అరుదు. అలాంటి సినిమాల్లో ఒకటి కేజీఎఫ్. ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ అయ్యే వరకు హీరో యశ్ గురించి తెలిసిన తెలుగువాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. కానీ.. కేజీఎఫ్ మొదటి భాగం విడుదలైన తర్వాత.. ఇప్పుడు యశ్ అంటే అందరికీ తెలుసు. అతన్ని కూడా రాఖీ భాయ్ గానే గుర్తు పెట్టుకున్నారు చాలా మంది. అదికూడా.. ‘కేజీఎఫ్ సినిమా హీరో యశ్’ అనే అంటారు. అంతలా జనాన్ని అట్రాక్ట్ చేసింది ఆ మూవీ.

ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సెకండ్ పార్ట్ కేజీఎఫ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. త్వరలోనే ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతోంది.

ఈ చిత్ర హీరో యశ్ బర్త్ డే సందర్భంగా ఈ జనవరి 8 న టీజర్ విడుదలకు ప్లాన్ చేసారు. అయితే.. ఇక్కడే పెద్ద డౌట్. ఈ సినిమా కోసం అన్ని భాషల వారూ ఎదురు చూస్తున్నారు. మరి, టీజర్ కూడా అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుందా? లేదా? అన్నదే ప్రశ్న. మేకర్స్ మాత్రం కేవలం కన్నడ టీజర్ ను మాత్రమే విడుదల చేయనున్నారని ఆ మధ్య టాక్ వచ్చింది.

అయితే.. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ టీజర్ ను కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. నిర్మాణ సంస్థ హోంబేల్ యూట్యూబ్ ఛానెల్ నుంచి విడుదల కాబోతోంది. అంటే.. కేవలం కన్నడ భాషలోనే టీజర్ విడుదలవుతుందన్నమాట. ఇదే జరిగితే ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఇతర ఇండస్ట్రీ అభిమానులకు కాస్త నిరాశే అని చెప్పాలి. మరి, నిజంగానే ఒకే భాషలో టీజర్ రిలీజ్ చేస్తారా? లేక అన్ని భాషల్లోనూ ప్లాన్ చేస్తారా? అన్నది చూడాలి.