Begin typing your search above and press return to search.

‘ఠాగూర్’మధు.. ‘క్రాక్’మధు అవుతారా?

By:  Tupaki Desk   |   21 Jan 2021 11:30 AM GMT
‘ఠాగూర్’మధు.. ‘క్రాక్’మధు అవుతారా?
X
తెలుగు సినిమా ప్రముఖ నిర్మాతల్లో బి.మధు ఒకరు. మెగాస్టార్ చిరంజీవితో 2003లో ఆయన తీసిన ‘ఠాగూర్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అవినీతిని కడిగిపారేసిన ఈ చిత్రం.. టాలీవుడ్ రికార్డులను కూడా క్లీన్ చేసింది. ఆ బ్లాక్ బస్టర్ తో బి.మధు కాస్తా.. ‘ఠాగూర్’మధు అయ్యారు. ఇప్పటికీ ఆయన్ను ఇలాగే పిలుస్తుంటారు.

అయితే.. ఠాగూర్ చిత్రం తర్వాత ఆయన పలు సినిమాలను నిర్మించారు. మరికొన్ని చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. తెలుగు హిట్ చిత్రం ఎన్టీఆర్ ‘టెంపర్’ను తమిళ్ లో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేశారు. విశాల్ పందెం కోడి-2 ను తెలుగులో రిలీజ్ చేశారు. ఇలా పలు సినిమాలను ప్రేక్షకులకు అందించినప్పటికీ.. సరైన బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు.

ఇలాంటి పరిస్థితుల్లో.. ఇన్నేళ్ల తర్వాత ఆయనకు ‘క్రాక్’రూపంలో ఓ మంచి హిట్ దక్కింది. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు నిలిస్తే.. పొంగల్ పందెం గెలిచిన పుంజు ‘క్రాక్’ మాత్రమే అని తెలిపోయింది! సంక్రాంతి పండగ సీజన్ అపోయిన తర్వాత కూడా కలెక్షన్ల జోరుకొనసాగిస్తోంది క్రాక్.

ఈ సినిమా ద్వారా అటు హీరో మాస్ మహరాజతోపాటు.. నిర్మాత మధు కూడా ఫామ్‌లోకి వచ్చేశారు. రవితేజతో హ్యాట్రిక్ చిత్రాలు రూపొందించిన దర్శకుడు గోపీచంద్ మలినేని సూపర్ హిట్ అందించాడు. ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి పలుచోట్ల స్క్రీన్స్, షోలు యాడ్ అవుతుండడమే కాకుండా.. ఇతర సినిమాలను రీప్లేస్ చేసి కూడా ‘క్రాక్’ను ప్రదర్శిస్తున్నారు.

దీంతో.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం తీసిన హిట్ చిత్రం ‘ఠాగూర్’ను ఇంటిపేరుగా మార్చుకున్న మధు.. ఇప్పుడు లేటెస్ట్ హిట్ తో ‘క్రాక్’మధుగా మారిపోరు కదా! అని చర్చించుకుంటున్నారు సినీజనాలు. బి.మధు ‘ఠాగూర్’మధుగానే కొనసాగుతారా? ‘క్రాక్’మధుగా పిలవబడతారా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.