Begin typing your search above and press return to search.

ఆమె తప్ప మరో దిక్కు లేదా?

By:  Tupaki Desk   |   2 July 2019 6:47 AM GMT
ఆమె తప్ప మరో దిక్కు లేదా?
X
'రాజు గారి గది 2' పెద్దగా ఆకట్టుకోక పోయినా కూడా దర్శకుడు ఓంకార్‌ చాలా నమ్మకంతో ఇటీవలే 'రాజు గారి గది 3' చిత్రాన్ని ప్రారంభించాడు. షూటింగ్‌ ప్రారంభం రోజే చిత్రంలో తమన్నా హీరోయిన్‌ గా నటించబోతుందని క్లారిటీ ఇచ్చాడు. ఆమె పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆ విషయం కన్ఫర్మ్‌ అయ్యింది. హీరోగా తమ్ముడు అశ్విన్‌ బాబు కాగా హీరోయిన్‌ గా తమన్నా అంటూ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అంతా బాగానే ఉంది షూటింగ్‌ కు వెళ్తారు అనుకుంటున్న సమయంలో తమన్నా తప్పుకుందట.

తమన్నా తప్పుకోవడంతో ఓంకార్‌ పలువురు హీరోయిన్స్‌ ను సంప్రదించాడు. కథలో తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోవడంతో పాటు.. గతంలో వచ్చిన రొటీన్‌ హర్రర్‌ సినిమాల మాదిరిగానే ఈ చిత్రం కథ ఉందనే ఉద్దేశ్యంతో తమన్నా తప్పుకుందట. తమన్నా తప్పుకోవడంతో పలువురిని పరిశీలించిన తర్వాత దర్శకుడు ఓంకార్‌ కు ఎటు చూసిన తాప్సి మాత్రమే కనిపించిందట. ఇటీవల కాలంలో ఈ అమ్మడు వరుసగా హర్రర్‌ సినిమాల్లో నటిస్తూ వస్తోంది.

తాప్సి నటించిన హర్రర్‌ సినిమాలు పెద్దగా ఆకట్టుకోక పోయినా కూడా అవే ఆఫర్లు ఆమెను వరిస్తున్నాయి. తాజాగా ఓంకార్‌ కూడా ఆమెను సంప్రదించినట్లుగా తెలుస్తోంది. నందిత శ్వేతను తీసుకోవాలని మొదట భావించినప్పటికి ఆమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు లేదని.. ఆమెతో పోల్చితే తాప్సి బెటర్‌ అన్న నిర్ణయానికి ఓంకార్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను మొదట సమంత హీరోయిన్‌ గా తీయాలని ఓంకార్‌ కోరుకున్నాడు. రెండవ పార్ట్‌ లో నటించిన సమంత ఈ పార్ట్‌ పై ఆసక్తి చూపించినా కథ విన్న తర్వాత వెనక్కు తగ్గినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.