Begin typing your search above and press return to search.

క్రేజీ టాక్‌.. సితార చుట్టు మ‌హేష్ సినిమా న‌డుస్తుందా?

By:  Tupaki Desk   |   12 Oct 2022 3:19 AM GMT
క్రేజీ టాక్‌.. సితార చుట్టు మ‌హేష్ సినిమా న‌డుస్తుందా?
X
వారసత్వం అనేది దాదాపు అన్ని రంగాల్లోనూ ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వారసులకు కొద‌వే లేదు. ఇప్పటికే ఎందరో వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు మరొక వారసురాలు సినీ రంగప్రవేశానికి సిద్ధమైంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని.

ఈమె తన తండ్రి మహేష్ బాబు సినిమా తోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టబోతోంద‌ట‌. ఆల్రెడీ సితార‌ మహేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన 'సర్కారు వారి పాట' సినిమాలోని ఓ సాంగ్ లో నటించింది. కానీ ఇది ప్రమోషనల్ సాంగ్. అయితే ఈసారి మాత్రం ఏకంగా సినిమాలో సితార భాగం కాబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వీరికి హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి అత‌డు, ఖ‌లేజా చిత్రాలు చేశారు. ఇవి క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ అవ్వ‌లేదు. కానీ, ప్రేక్ష‌కులను బాగానే అల‌రించాయి. దీంతో వీరి తాజా ప్రాజెక్ట్ పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 'ఎస్ఎస్‌ఎంబి 28' వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ సైతం ప్రారంభం కాబోతోంది. ఇందుకు మేక‌ర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సితార నటించ‌బోతోందని తాజాగా ఓ క్రేజీ టాక్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో ఓ పాప పాత్ర హైలెట్ గా నిల‌వ‌బోతోంద‌ట‌. ఆ పాత్ర చుట్టూనే ఈ సినిమా కథ నడుస్తోందట. ఆమెను హీరో కాపాడేందుకు చేసే ప్రయత్నాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయట.

అయితే ఆ పాప పాత్రలోనే సితార నటించబోతోందని అంటున్నారు. 'యాక్టర్ కావాలని అనుకుంటున్నాను. అది నా డ్రీమ్' అని సితార ఇప్ప‌టికే ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ త‌న సినిమాతో కూతురిని ప‌రిచ‌యం చేయాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌.

ఇందులో భాగంగానే సితారకు యాక్టింగ్, డాన్స్ ల‌లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నారట. అయితే, ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌ రాలేదు. మరి నిజంగానే మహేష్ సినిమాతో సితార సినీ రంగ ప్రవేశం చేస్తుందా..? లేదా..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.