Begin typing your search above and press return to search.

వర్షాలు తగ్గితేనే 'పుష్ప 2' పై క్లారిటీ వస్తుందా..?

By:  Tupaki Desk   |   23 July 2022 3:53 AM GMT
వర్షాలు తగ్గితేనే పుష్ప 2 పై క్లారిటీ వస్తుందా..?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సాధించిన విజయంతో ఇప్పుడు రెండో భాగం 'పుష్ప: ది రూల్' పై అంచనాలు మామూలుగా లేవు. తెలుగు కంటే నార్త్ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ మూవీ మాత్రం నిరవధికంగా ఆలస్యమవుతూ వస్తోంది.

'పుష్ప 1' ఘనవిజయం సాధించడంతో సుకుమార్ ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసుకున్నాడు. మార్చి లోనే రెండో భాగాన్ని మొదలు పెట్టాలని భావించాడు కానీ.. అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్టు రెడీ చేయడానికి, ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయమే తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ పార్ట్ ను మించేలా.. భారీ బడ్జెట్ తో అదనపు హంగులతో ఈ సినిమాను పిక్చరైజ్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే 'పుష్ప 2' షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది.

'పుష్ప' యూనిట్ ప్రస్తుతం లొకేషన్ల సమస్యను ఎదుర్కొంటోందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి భాగాన్ని ఎక్కువ శాతం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే లొకేషన్స్ లో షూటింగ్ జరపాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు షెడ్యూల్ ప్లాన్ చేయాలంటే వరుణుడు అడ్డంకిగా మారాడు.

కరోనా పాండమిక్ టైంలో మారేడుమిల్లి ప్రాంతంలో 'పుష్ప' చిత్రాన్ని చిత్రీకరించారు. అయితే ఇప్పుడు ఈ ఫారెస్ట్ రేంజ్‌ లో విపరీతమైన వర్షం పడుతోంది. ఇలాంటి పరిస్థితులతో షూటింగ్ చేయడం చాలా కష్టం. ఇది వర్షాకాలం కాబట్టి.. వానలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదు. అక్కడే షూటింగ్ చేయాలంటే ఇంకొన్ని రోజులు వేచి చచూడాల్సి ఉంటుంది.

అయితే ఇక్కడ మరో విషయమేంటంటే.. మొదటి భాగాన్ని చిత్రీకరించిన అదే లొకేషన్‌లను మళ్లీ ఉపయోగించడం వల్ల పునరావృతమయ్యే అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి సుక్కూ అండ్ టీమ్ 'రంగస్థలం' షూటింగ్ జరిగిన లొకేషన్‌ లకి వెళ్లొచ్చు. కానీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆ ప్రాంతాలన్నీ దాదాపు నీట మునిగాయి. ఇప్పుడప్పుడే షూటింగ్ కు అనుకూలంగా మారడం అసాధ్యమనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో 'పుష్ప 2' నేపథ్యానికి సరిపోయే లొకేషన్ల కోసం చిత్ర బృందం ఇతర రాష్ట్రాలను పరిశీలిస్తోందని టాక్ వినిపిస్తోంది. కేరళ అడవుల్లో లేదా విదేశాల్లో షూటింగ్ చేసే ప్రాంతాల కోసం వెతుకులాట సాగిస్తున్నారట. ఇక్కడ సుకుమార్ కు మరో ఆప్షన్ కూడా ఉంది. వర్షాల సీజన్ తగ్గే వరకూ ప్రత్యేకంగా నిర్మించే సెట్స్ లో జరగాల్సిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేయొచ్చు.

ఒకవేళ అడవుల్లోనే ముందుగా షూటింగ్ చేయాలని భావిస్తే మాత్రం అక్టోబర్ లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి. మరోవైపు ఈ సినిమా కోసం చిత్తూరు యాసలో మాట్లాడే నటీనటుల కోసం చిత్ర యూనిట్ వేట ప్రారంభించింది.

కాగా, శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' సినిమాలో చూపించారు. ఇప్పుడు రెండో భాగంలో శత్రువులను ఎదుర్కొని ఆ సామ్రాజ్యాన్ని ఎలా ఎలాడనేది చూపిస్తారు.

ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. వీరికి విజయ్ సేతుపతి కూడా తోడవుతాడానే టాక్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రానికిదేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో 'పుష్ప 2' విడుదలవుతుంది.